LS Polls: 102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్‌ 19న) పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Updated : 18 Apr 2024 22:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ సార్వత్రిక ఎన్నికల (Lok Sabha polls) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. తొలిదశలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్‌ 19న) పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకూ ఓటింగ్‌ జరగనుంది.

కూటముల పోరు.. కలిసొచ్చేది ఎవరికి?

ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సాగే ఈ ప్రక్రియను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ తగు చర్యలు తీసుకుంది. ఓటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. ఈసీ వివరాల ప్రకారం తొలి విడత సమగ్ర స్వరూపమిది.

  • మొత్తం లోక్‌సభ స్థానాలు: 102 (73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ)
  • పోటీలో ఉన్న అభ్యర్థులు:  1625 మంది (1491 మంది పురుషులు, 134 మంది మహిళలు)
  • పోలింగ్‌ కేంద్రాలు / సిబ్బంది: 1.87 లక్షలు / 18 లక్షల మంది
  • ఓటర్లు: 16.63 కోట్ల మంది (పురుషులు 8.4 కోట్లు, మహిళలు 8.23 కోట్లు, ఇతరులు 11,371 మంది)
  • 35.67 లక్షల మంది తొలిసారి తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
  • పోలింగ్ ఏర్పాట్లకు 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు లక్ష వాహనాల వినియోగం
  • 50 శాతానికిపైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల నియామకం
  • 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది ఓటర్లు, 13.89 లక్షల మంది దివ్యాంగులకు ఇంటివద్దే ఓటు హక్కు సౌకర్యం
  • 5 వేలకుపైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు, 1000 ఓటింగ్‌ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు.

ప్రాంతాల వారీగా స్థానాలు

తమిళనాడు (39), రాజస్థాన్‌ (12), ఉత్తర్‌ప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6), మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్‌ (5), బిహార్‌ (4), పశ్చిమ బెంగాల్‌ (3), అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ (2), ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ-కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి (1).

బరిలో ఉన్న ప్రముఖులు

నితిన్‌ గడ్కరీ, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్‌, కనిమొళి, అన్నామలై, సర్బానంద సోనోవాల్‌, అర్జున్‌ మేఘ్‌వాల్‌, ఎల్‌.మురుగన్‌, బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌, తమిళసై సౌందరరాజన్‌, గౌరవ్‌ గొగొయ్‌, జితిన్‌ ప్రసాద, జీతన్‌ రామ్‌ మాంఝీ, నకుల్‌నాథ్‌ తదితరులు.

ప్రభుత్వాన్ని నిర్ణయించేది మీరే.. సీఈసీ సందేశం

తొలిదశ పోలింగ్‌ వేళ ఓటు ప్రాధాన్యాన్ని వివరిస్తూ భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఓటు వేయడానికి మించింది లేదని పేర్కొంటూ.. యువత పెద్దఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘మన గొప్ప ప్రజాస్వామ్యంలో.. ప్రభుత్వాన్ని నిర్ణయించేది మీరే. మీ దేశం, ప్రాంతం, కుటుంబం, మీ భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు. ఒక్క ఓటే కదా అని తక్కువ అంచనా వేయొద్దు. ఎన్నికల సమరంలో ఒక్క ఓటూ కీలకంగా మారిన సందర్భాలు ఉన్నాయి’’ అని ఓటర్లను ఉద్దేశించి సీఈసీ పేర్కొన్నారు. వడగాలుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి తాపాన్ని భారత ఓటర్ల స్ఫూర్తి జయిస్తుందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని