కూటముల పోరు.. కలిసొచ్చేది ఎవరికి?

సార్వత్రిక ఎన్నికల సమరాన తమిళనాడులో చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధాన పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా కూటముల మధ్యే నెలకొంది.

Updated : 18 Apr 2024 06:03 IST

తమిళనాడులో త్రిముఖ పోటీ

సార్వత్రిక ఎన్నికల సమరాన తమిళనాడులో చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధాన పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా కూటముల మధ్యే నెలకొంది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘ఇండియా’ కూటమి గెలవాలనే లక్ష్యంతో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తమ బలాన్ని చాటాలని, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా  మారాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది. జయలలిత మృతి తర్వాత ఆటుపోట్లు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగిన దర్శక నటుడు సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.


బలం... బలగం...

  • గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో తేని మినహా మిగతా అన్నీ స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో దాదాపు అవే పార్టీలతో ‘ఇండియా’ కూటమిగా బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కొంత ప్రభావం చూపిన నటుడు కమలహాసన్‌ నేతృత్వంలోని మక్కళ్‌ నీదిమయ్యం కూడా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరిని మినహాయించి డీఎంకే కూటమి పార్టీలు 21 మంది సిట్టింగ్‌లను అవే నియోజకవర్గాలు నుంచి బరిలోకి దించడం గమనార్హం. వారిలో డీఎంకే తరఫున 10 మంది, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, వీసీకే, సీపీఎం తరఫున ఇద్దరు చొప్పున, సీపీఐ, ఐయూఎంఎల్‌ తరఫున ఒకరు చొప్పున ఉన్నారు.
  • పన్నీర్‌సెల్వం విడిపోవడం, భాజపా, ఇతర పార్టీలు ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసుకోవడం వంటి కారణాలతో గతంలో కన్నా అన్నాడీఎంకే బలహీనపడింది. ప్రస్తుతం తన నేతృత్వంలోని కూటమి పక్షాలైన ఎస్డీపీఐ, డీఎండీకే, పుదియ తమిళగం పార్టీలకు 7 స్థానాలు కేటాయించి మిగతా 32 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేస్తోంది.
  • ప్రస్తుత ఎన్నికల్లో భాజపా ప్రత్యేక కూటమితో బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే, పుదియ నీది కట్చి, తమిళ మానిల కాంగ్రెస్‌ పార్టీలు, అన్నాడీఎంకే చీలికవర్గం నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే, గత ఎన్నికల్లో డీఎంకే వెంటనున్న ఐజేకే పార్టీ... కమలం కూటమిలోకి వచ్చాయి.

పశ్చిమంలో పట్టు కోసం..

పది లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ జిల్లాల్లో మోటారు, వస్త్ర, అద్దకం పరిశ్రమలు ఉన్నాయి. ప్రధాన పోటీ డీఎంకే, భాజపా మధ్యే కనిపిస్తోంది. హేమాహేమీలను భాజపా కూటమి రంగంలోకి దించింది. ధర్మపురి నుంచి కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి సతీమణి సౌమ్య(పీఎంకే), కోయంబత్తూర్‌ నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, నీలగిరి నుంచి కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌ బరిలో ఉన్నారు. డీఎంకే కూటమి తరఫున ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు బరిలో ఉన్నారు. వారిలో 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా ఒకరు. ఆయన నీలగిరి నుంచి పోటీ చేస్తున్నారు.


ఉత్తరంలో సిట్టింగ్‌ల జోరు

12 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తర జిల్లాలు డీఎంకేకు కంచుకోటలు. వాటిలో మూడు స్థానాలు చెన్నై జిల్లాలో ఉన్నాయి. ఇతర జిల్లాల్లోని కాంచీపురం, అరక్కోణం, విళుపురం, వేలూర్‌, శ్రీపెరుంబుదూర్‌, తిరువణ్ణామలై నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి తరఫున సిట్టింగ్‌ ఎంపీలు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే, భాజపా కూటములు కూడా దీటైన అభ్యర్థులనే రంగంలోకి దించాయి. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెన్నై దక్షిణం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉత్తర జిల్లాల్లోని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి తరఫున సిట్టింగ్‌ ఎంపీలు పోటీలో ఉన్నారు. వాటిని ఈ కూటమి మళ్లీ దక్కించుకునే అవకాశం ఉంది.


దక్షిణంపై భాజపా ప్రభావం

దక్షిణ జిల్లాల్లో 9 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా అక్కడ భాజపాకు స్వల్ప ఓటు బ్యాంకు ఉంది. ఈ జిల్లాల్లోని కన్నియాకుమరి నుంచి కేంద్ర మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌, రామనాథపురం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, తేని నుంచి ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, విరుదునగర్‌ నుంచి సినీనటి రాధిక భాజపా కూటమి అభ్యర్థులుగా ఉన్నారు. ఒకట్రెండు స్థానాల్లో భాజపా కూటమి గెలవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


రగులుతున్న కావేరీ డెల్టా

రాష్ట్రంలోని సెంట్రల్‌ జోన్‌లో 8 జిల్లాలు ఉండగా వాటిలో అత్యధికం కావేరి డెల్టా జిల్లాలే. ఇక్కడి 8 స్థానాల్లోని అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది రైతులే. వారిలో తటస్థ ఓటర్లు డీఎంకే, భాజపా కూటములపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కర్ణాటక నుంచి కావేరి జలాల వాటాను సక్రమంగా పొందలేకపోవడం, సిరువాణి నదిపై కర్ణాటక ఆనకట్ట నిర్మించడాన్ని అడ్డుకోలేకపోవడం, రైతుల సాగు భూములను కార్పొరేట్ల కోసం స్వాధీనం చేసుకోవడం వంటి డీఎంకే ప్రభుత్వ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, మద్దతు ధర కల్పించకపోవడం, రుణాలు మాఫీ చేయకపోవడం వంటి కారణాలతో కేంద్రంలోని భాజపా సర్కారుకూ ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తోంది. భాజపా, డీఎంకే కూటములకు వ్యతిరేకంగా తంజావూర్‌లో తమిళనాడు రైతు సంఘాల సమాఖ్య తమ అభ్యర్థిని బరిలోకి దించింది. డీఎంకే, భాజపాలపై ఉన్న వ్యతిరేకత అన్నాడీఎంకే కూటమికి కొంత కలిసి రావచ్చని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.


ప్రధాన సమస్యలివే... నీట్‌ జ్వాలలు

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష... నీట్‌ తమకు వద్దని, వైద్య సీట్ల భర్తీని రాష్ట్రానికే పరిమితం చేయాలని, తమ ఉద్యోగాలు తమకే కావాలని తమిళనాడులో పెద్ద డిమాండ్‌ నడుస్తోంది. ఈ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు సాధించడం కీలకంగా మారింది.


పరిశ్రమల కష్టాలు

కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. దీని ప్రభావం చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి, తిరుప్పూరు, తిరుచ్చిలాంటి పలు పార్లమెంటు స్థానాల్లో కనిపిస్తోంది. జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు 2022 నుంచి పెరిగిన విద్యుత్తు బిల్లులు పరిశ్రమలకు కష్టాలతో పాటు నష్టాలను తెచ్చాయి. ఉత్పత్తి నిలిపివేసినా ఫిక్స్‌డ్‌ విద్యుత్తు ఛార్జీలు చెల్లించాలనే వివాదం పెద్దదవుతోంది.


కచ్చతీవు అప్పగింత

మత్స్యకారుల ఓట్లపై గురిపెట్టిన భాజపా కచ్చతీవు అంశాన్ని అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్‌, డీఎంకేలు రాష్ట్రానికి ద్రోహం తలపెట్టేలా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించాయని ఆరోపిస్తోంది.


నిధులపై రచ్చ

రాష్ట్రానికి రూ.వేల కోట్ల నిధులిచ్చామని, వాటిలో అవినీతికి పాల్పడి తినేశారని భాజపా ఆరోపిస్తోంటే, అసలు రాష్ట్రానికి కేంద్ర సహకారం అందలేదని డీఎంకే పెద్దఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. భీకర వరదలకు గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకురాలేదని విమర్శిస్తోంది.

 ఈనాడు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని