Punjab: 12వేల మంది కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజ్‌.. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు బస్సులు

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వేల మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు.

Published : 28 Jul 2023 20:24 IST

చండీగఢ్‌: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 12,710మంది ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించింది. అలాగే,  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన పత్రాలను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ  త్వరలోనే బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద 20వేల మంది విద్యార్థులకు (12వేల మంది బాలికలు; 8వేల మంది బాలుర)కు ఈ సర్వీసులను అమలు చేస్తామని తెలిపారు. బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి తమ విద్యను పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఈ పథకం చేపడుతున్నామని సీఎం చెప్పారు. ఈ బస్సుల్లో జీపీఎస్‌ డివైజ్‌లను సైతం అమర్చనున్నట్టు చెప్పిన సీఎం.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ట్రాక్ చేసే అవకాశం ఉంటుందన్నారు.

సీఎం మాన్‌ భావోద్వేగం

టీచర్లకు ఉద్యోగ భద్రత ఉంటేనే విద్యార్థుల జీవితాలను మార్చగలరనే ఉద్దేశంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి భగవంత్‌ మాన్‌  ఒప్పంద టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడంపై దృష్టిసారించారు. ఇందులో ఉన్న చట్టపరమైన, పరిపాలనాపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు కృషిచేశారు. తన ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించడంపై ఓ ఉపాధ్యాయుడు కన్నీళ్లతో సీఎంను ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు చెప్పారు. దీంతో సీఎం మాన్‌ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని.. ఆ వర్గం ఎదుర్కొనే ఇబ్బందులేంటో తనకు తెలుసన్నారు.  గత ప్రభుత్వాల పాలకులు పట్టించుకోని కారణంగానే టీచర్లు చాలీచాలని వేతనాలతో పనిచేయాల్సి వచ్చిందని.. చట్టబద్ధమైన హక్కుల కోసం కూడా నిరసనలు చేయాల్సిన పరిస్థితి రావడం రాజభవనాల్లో నివసించే నేతలు (ఎవరి పేరునూ ప్రస్తావించలేదు) ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని.. వాళ్లకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియవన్నారు. ఉపాధిహామీ పనులకు వెళ్తున్నవారికి కూడా టీచర్ల కన్నా ఎక్కువ వేతనం వచ్చే పరిస్థితి ఇదివరకు ఉండేదన్నారు.

భారీగా పెరిగిన వేతనాలు

ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం.. టీచర్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెరిగాయి. ఇదివరకు పంజాబ్‌లో అసోసియేట్‌ టీచర్లకు నెలకు రూ.9500ల చొప్పున వేతనం ఉండగా.. ఇప్పుడది రూ.20,500లకు పెరగనుంది. అలాగే, ఎలిమెంటరీ టీచర్‌ ట్రైనింగ్‌, నర్సరీ టీచర్‌ ట్రైనింగ్‌ అర్హత కలిగిన టీచర్లకు రూ.10,250 నుంచి రూ. 22వేలు; బీఏ/ఎంఏ బీఈడీ డిగ్రీలు కలిగిన ఉపాధ్యాయులకు రూ. 11వేలు నుంచి రూ.23,500లకు వేతనాలు పెరగనున్నాయి. ఏటా 5శాతం ఇంక్రిమెంట్‌తో పాటు ఇతర సౌకర్యాలను కూడా ఉపాధ్యాయులకు ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. ఉపాధ్యాయులకు కేవలం బోధనాపరమైన వ్యవహారాలకే తప్ప నాన్‌టీచింగ్‌ డ్యూటీని కేటాయించరాదని ఇదివరకే తమ ప్రభుత్వం నిర్ణయించిందని మాన్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని