Lok Sabha Secretariat: పార్లమెంటు ఛాంబర్లు, లాబీల్లోకి ఆ ఎంపీలకు ప్రవేశం లేదు!

సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంటు ఛాంబర్‌, లాబీతోపాటు గ్యాలరీల్లోకి ప్రవేశించడానికి వీలులేదని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది.

Published : 20 Dec 2023 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై (Parliament security breach) హోం మంత్రి అధికారిక ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో ఉభయ సభల్లో మొత్తం 141 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ (MPs Suspension) వేటు పడింది. వీరిపై లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆంక్షలు విధించింది. ఈ ఎంపీలు పార్లమెంటు ఛాంబర్‌, లాబీతోపాటు గ్యాలరీల్లోకి ప్రవేశించడానికి వీలులేదని పేర్కొంటూ సర్క్యులర్‌ జారీ చేసింది.

‘సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్‌ (Parliament) ఛాంబర్‌, లాబీ, గ్యాలరీల్లోకి రాకూడదు. పార్లమెంటరీ కమిటీల నుంచీ  వారు సస్పెండ్‌ అయినట్లే. లిస్ట్‌ ఆఫ్‌ బిజినెన్‌లో వారి పేర్లతో ఎటువంటి ఐటమ్‌లు పెట్టవద్దు. సస్పెన్షన్‌ అమల్లో ఉన్న కాలంలో వారు ఇచ్చే ఏ నోటీసు స్వీకరించం. కమిటీ ఎన్నికల్లోనూ ఓటు వేయలేరు. సస్పెన్షన్‌ సమయంలో రోజువారీ భత్యం కూడా పొందలేరు’ అని లోక్‌సభ సెక్రటేరియట్‌ జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.

విపక్ష సభ్యుల సస్పెన్షన్‌.. మిగిలింది 43 మందే!

పార్లమెంటు ఉభయ సభల నుంచి ఇప్పటివరకు 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురికాగా.. వారిలో లోక్‌సభ (Lok Sabha) నుంచి 95 మంది రాజ్యసభ (Rajya Sabha) నుంచి 46 మంది ఉన్నారు. పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ స్థాయిలో ఎంపీలపై చర్యలు తీసుకోవడంపై విపక్ష పార్టీలు మండిపతున్నాయి. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 22 నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తాజాగా జరిగిన విపక్షాల కూటమి ‘ఇండియా’ భేటీలోనూ ఎంపీల సస్పెన్షన్‌ విషయాన్ని చర్చించామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భాగస్వామ్య పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని