Election Commission: రెండు రోజుల్లో కౌంటింగ్‌.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు

అధికార ‘ఎన్డీయే’, విపక్ష ‘ఇండియా’ కూటములు ఆదివారం ఎన్నికల సంఘం తలుపు తట్టాయి.

Updated : 02 Jun 2024 21:33 IST

దిల్లీ: మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (Lok Sabha Results) వెల్లడి కానున్న వేళ.. అధికార భాజపా, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఒకే రోజు ఎన్నికల సంఘం (Election Commission) తలుపు తట్టారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఇండియా కూటమి (INDIA Bloc) నేతలు అభ్యర్థించగా.. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేందుకు వారు యత్నిస్తున్నారని భాజపా (BJP) ఆరోపించింది. మరోవైపు.. సోమవారం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ‘ఈసీ’ ప్రకటించింది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని సమాచారం.

ప్రతిపక్ష కూటమి నేతలు ఆదివారం ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. కౌంటింగ్‌ వేళ ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను సీసీటీవీ పర్యవేక్షణలో తరలించాలని, వాటిపై తేదీ, సమయాన్ని ధ్రువీకరించాలని కోరారు. లేనిపక్షంలో.. సంబంధిత పోలింగ్‌ కేంద్రం నుంచి అదే కంట్రోల్‌ యూనిట్‌ వచ్చిందని చెప్పడానికి ప్రామాణికత ఏదీ ఉండదని చెప్పారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు సమయంలో క్షేత్రస్థాయి అధికారులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.

ఇవి ఎగ్జిట్ పోల్స్‌ కావు.. మోదీ పోల్స్‌: రాహుల్‌ గాంధీ

ప్రజాస్వామ్య సంస్థలపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు నేరుగా దాడికి దిగుతున్నాయని, ఎన్నికల ప్రక్రియకు ముప్పుగా పరిణమిస్తున్నాయని భాజపా ఆరోపించింది. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌లతో కూడిన బృందం ఈసీ అధికారుల్ని కలిసింది. ‘‘విపక్షాలకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. మొదట సంస్థను.. ఆపై సంస్థ పనితీరు, పద్ధతులను లక్ష్యంగా చేసుకుంటాయి. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే.. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, వీవీప్యాట్లపై ప్రశ్నలను లేవనెత్తుతాయి. తమ ఓటమికి ఎవరిని బలిపశువు చేయాలా? అని చూస్తాయి. ఓటర్ల తీర్పును అంగీకరించేందుకు ఇష్టపడవు’’ అని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు జూన్‌ 4న అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని