Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది మరణించగా, 57 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Updated : 31 May 2024 06:12 IST

బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం
57 మందికి గాయాలు
బాధితులంతా హరియాణా, యూపీ యాత్రికులు
శివఖోరీ గుహాలయానికి వెళ్తుండగా ఘటన

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది మరణించగా, 57 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. జమ్ము-పూంఛ్‌ జాతీయ రహదారిపై చౌకీ చోరా బెల్ట్‌లో టుంగీ-మోడ వద్ద యాత్రికుల బస్సు గురువారం మధ్యాహ్నం 12.35కి అదుపు తప్పి 150 అడుగుల లోతున లోయలో పడిపోవడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులోని వారంతా హరియాణాలోని కురుక్షేత్ర, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. యూపీలోని హథ్రాస్‌ నుంచి యాత్రికులతో జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా పవనీ ప్రాంతంలో గల శివఖోరీ గుహాలయానికి బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.  

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయకబృంద సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి అఖ్నూర్‌లోని సబ్‌ డిస్ట్రిక్ట్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు జమ్మూ కలెక్టర్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. 

ప్రమాదకర మలుపు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో  ప్రమాదం జరిగిందని గాయపడిన బాధితులు వెల్లడించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు లేరని పోలీసు అధికారి స్పష్టం చేశారు. బస్సులో సుమారు 80 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. సైనికులు, పోలీసులు, స్థానికులు తాళ్ల సహాయంతో మానవ గొలుసుల్లా ఏర్పడి మృతదేహాలను, గాయపడినవారిని లోయ నుంచి పైకి చేర్చారు. బస్సును పైకి తీసుకువచ్చేందుకు సైన్యం క్రేన్లను ఉపయోగించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పునజమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పరిహారం ప్రకటించారు.  ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని