Lok Sabha: మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌.. లోక్‌సభ నిరవధిక వాయిదా

విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Updated : 23 Dec 2023 14:22 IST

దిల్లీ: లోక్‌సభ (Lok Sabha)లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం గురువారం కూడా కొనసాగింది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది.  కాంగ్రెస్‌ పార్టీ (Congress)కి చెందిన  ఎంపీలు దీపక్‌ బైజ్‌, డీకే సురేశ్‌, నకుల్‌ నాథ్‌ అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్‌ ఓం బిర్లా(Om Birla) వారిపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకూ లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 100కి చేరింది. అలాగే, ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146గా ఉంది. మరోవైపు, లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ‘సీఈసీ, ఈసీ’తో పాటు ది ప్రెస్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు 2023లకు ఆమోదం తెలిపిన అనంతరం సభను  నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగానే లోక్‌సభ సమావేశాలను ముగించారు.

‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

తొలుత.. గురువారం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే.. పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై ఈ ముగ్గురు ఎంపీలు నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లారు.  దీంతో స్పీకర్‌ ఓం బిర్లా వారికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఈ ముగ్గురు ఎంపీల సస్పెన్షన్‌కు సంబంధించి తీర్మానం చేయడంతో ఈ ముగ్గురు ఎంపీలపై వేటు పడింది.   ఇటీవల లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ అంశంపై ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని