Parliament: ‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. ఇప్పటికే రాజ్యసభ దీన్ని ఆమోదించింది.

Updated : 21 Dec 2023 17:20 IST

దిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటు (Parliament)లో ఆమోదం లభించింది. ‘ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు- 2023’ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ (Lok Sabha) ఆమోదించింది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. కొత్త బిల్లు ప్రకారం.. ఇక నుంచీ సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి.

‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ.. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలూ ఇందులో పొందుపర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని