LS Election Results: 369 మంది పోటీ చేస్తే.. 311 మందికి డిపాజిట్‌ దక్కలేదు..!

LS Election Results: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఏకంగా 84 శాతానికి పైగా అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది.

Published : 07 Jun 2024 19:11 IST

భోపాల్‌: ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) మధ్యప్రదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 29 స్థానాల్లోనూ కమలం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించారు. గత 40 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేనా.. ఇక్కడ విజయం సాధించిన అభ్యర్థుల మెజార్టీ కూడా భారీగానే ఉంది. దీంతో చాలామంది ఇతర పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదు.

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh News) మొత్తం 29 స్థానాలకు గానూ 369 మంది పోటీ చేశారు. వీరిలో 311 మందికి కనీస ఓట్లు రాకపోవడంతో సెక్యూరిటీ డిపాజిట్ల (Security Deposits)ను కోల్పోయారని అధికారులు వెల్లడించారు. భాజపా నుంచి గెలుపొందిన 29 మందితో పాటు కాంగ్రెస్‌ నుంచి 27 మంది, బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఇద్దరు మాత్రమే డిపాజిట్‌ దక్కించుకున్నారని మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి అనుపమ్‌ రంజన్‌ తెలిపారు. ఈసీ నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో (Lok Sabha Elections) నిలబడిన అభ్యర్థి తాను పోటీచేసే నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లను సాధిస్తేనే ధరావతు దక్కుతుంది.

నేనూ ‘సూపర్‌ఓవర్‌’లోనే గెలిచా: శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

26 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థి మెజార్టీ లక్ష నుంచి 5 లక్షల ఓట్ల వరకు ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక, లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ నమోదైంది కూడా ఈ రాష్ట్రంలోనే. ఇండోర్‌ (Indore) స్థానంలో భాజపా అభ్యర్థి శంకర్‌ లాల్వానీ ఏకంగా 11.75లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో అఖండ మెజార్టీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ పోటీలో లేకుండాపోయింది. ఈ స్థానంలో బీఎస్పీ అభ్యర్థికి 51వేల ఓట్లు రాగా.. పోటీలో ఉన్న మిగతా 13 మంది డిపాజిట్లు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని