Shashi Tharoor: నేనూ ‘సూపర్‌ఓవర్‌’లోనే గెలిచా: శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Shashi Tharoor: లోక్‌సభ ఎన్నికల్లో తనది కూడా ‘సూపర్‌ ఓవర్‌’ విజయమేనని అంటున్నారు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌. ఇక, రాహుల్‌ గాంధీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అని ప్రశంసించారు.

Published : 07 Jun 2024 17:26 IST

దిల్లీ: కేరళలోని తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగోసారి విజయాన్ని అందుకున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor). ఈ స్థానంలో భాజపా తరఫున కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పోటీచేయగా.. ఫలితాల్లో ఇద్దరి మధ్యా గట్టి పోటీ కన్పించింది. చివరకు 16,077 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో థరూర్‌ గెలుపొందారు. దీనిపై తాజాగా ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌ పరిభాషను ఉపయోగిస్తూ తాను ‘సూపర్‌’ విక్టరీ (Super over victory) అందుకున్నానని అన్నారు.

‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Elections) కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ (Congress)కు గట్టి పోటీ ఎదురైంది. నా విషయమే చూసుకుంటే.. నా నియోజకవర్గంలో పోటీ ‘సూపర్‌ ఓవర్‌’కు వెళ్లింది. మెజార్టీ ఎందుకు తగ్గిందనే దానికి చాలా కారణాలుంటాయి. ఏదేమైనా చివరకు విజయం విజయమే. ఆ తీపిని నేను ఆస్వాదిస్తున్నా’’ అని థరూర్‌ వ్యాఖ్యానించారు.

ఇకపై మోదీ తనకు నచ్చినట్లు చేస్తానంటే కుదరదు: శశి థరూర్‌

రాహుల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’..

ఇక కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గురించి స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో ఆయనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అని ప్రశంసించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఆయనే ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ అద్భుతమైన ప్రదర్శన చేసిందన్నారు.  ‘‘రాహుల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఖర్గేజీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే లోక్‌సభలో మాకు బలమైన ప్రాతినిధ్యం ఉంది. ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కచ్చితంగా పాపులర్‌ లీడర్‌ ప్రతిపక్ష నేతగా ఉండాలి. అందుకు రాహుల్‌ సరిగ్గా సరిపోతారు’’ అని థరూర్‌ (Congress Leader Shashi Tharoor) అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు