Killer Tiger: కిల్లర్‌ టైగర్‌ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్‌ అలర్ట్‌!

మధ్యప్రదేశ్‌లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Published : 20 May 2024 00:03 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్‌ జిల్లాలో ఓ వృద్ధుడిపై పులి దాడి చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే 100 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుండగా.. మరో 50 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక అటవీ అధికారులు వెల్లడించారు.

రాయ్‌సేన్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లోని మానవ నివాస ప్రాంతాల్లో సంచరిస్తోన్న ఓ పులి.. ఇటీవల ఓ 62 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి చంపినట్లు గుర్తించారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి.. అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు. మరోసారి దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో 150 కి.మీ పరిధిలోని 36 గ్రామాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఎన్నడూ లేనివిధంగా దారుణంగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో సమీప గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు

కిల్లర్‌ పులిగా పేర్కొంటున్న ఈ మృగాన్ని బంధించేందుకు అటవీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 100 కెమెరాలతో నిఘా పెట్టగా.. మరో 50 కెమెరాలను అమర్చనున్నారు. అటవీ అధికారులతోపాటు వాలంటీర్లతో కూడిన మొత్తం 100 మంది పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఎరలతో కూడిన మూడు బోన్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా పులి వారానికి ఓసారి వేటాడుతుందని అటవీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో రెండు, మూడు రోజుల్లోనే అది మరోసారి దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నారు. ఈ పులిని బంధించడం కష్టమే అయినప్పటికీ.. ఇటువంటి సమయంలోనే దాన్ని బంధించడం కుదురుతుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్థానిక డీఎఫ్‌వో పేర్కొన్నారు. భోపాల్‌కు సమీపంలోని రాతాపానీ టైగర్‌ రిజర్వ్‌లో దాదాపు 60 పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని