Ayodhya Ram Mandir: వెయ్యేళ్ల వరకు మరమ్మతులు అవసరం లేకుండా రామ మందిర నిర్మాణం

వెయ్యేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండా రామ మందిరం (Ram Mandir) నిర్మాణం జరుగుతోందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు (Shri Ram Janmbhoomi Teerth Kshetra) తెలిపింది. త్రేతాయుగం నాటి పరిస్థితులను వివరించేలా రామ మందిరంలోని పిల్లర్లపై విగ్రహాలను చెక్కుతున్నట్లు వెల్లడించింది.

Updated : 11 Jan 2024 13:55 IST

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తున్న రామ మందిరం (Ram Mandir) భూ అంతస్తు (గ్రౌండ్‌ ఫ్లోర్‌) నిర్మాణం 80శాతం పూర్తైందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు (Shri Ram Janmbhoomi Teerth Kshetra) తెలిపింది. 2024 జనవరి 15 లేదా 24 తేదీల్లో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ట్రస్టు వెల్లడించింది. ‘‘అక్టోబరు నాటికి భూ అంతస్తు నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. డిసెంబరు నాటికి మెరుగులు అద్దడం పూర్తి చేస్తాం. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి విగ్రహాలను మొదటి అంతస్తులో ప్రతిష్ఠిస్తాం. గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని 2024 జనవరి 15 లేదా 24 నాటికి ప్రతిష్ఠిస్తాం’’ అని రామజన్మభూమి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ తెలిపారు. 

రామ మందిర నిర్మాణంలో 21 లక్షల క్యూబిక్‌ అడుగుల గ్రానైట్‌, ఇసుక రాయి, మార్బుల్‌ ఉపయోగించినట్లు తెలిపారు. ‘‘రామ మందిర ప్రధాన భాగం మార్బుల్‌తో నిర్మించాం. మహారాష్ట్ర నుంచి తెచ్చిన టేకు కలపతో తలుపులు తయారుచేస్తున్నారు. వాటిపై ఆకృతులకు తీర్చిదిద్దే పని ఇప్పటికే మొదలైంది. వెయ్యేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండా మందిర నిర్మాణం జరుగుతోంది’’ అని చంపత్‌ రాయ్‌ తెలిపారు. 

Kedarnath Temple: కేదార్‌నాథ్‌ ఆలయంలో ఫొటోలు/వీడియోలపై నిషేధం

త్రేతాయుగం నాటి పరిస్థితులను వివరించేలా రామ మందిరంలోని 162 పిల్లర్లపై 4,500 విగ్రహాలను చెక్కుతున్నట్లు రాయ్ వెల్లడించారు. రాజస్థాన్‌, కేరళ నుంచి వచ్చిన శిల్పకళాకారులు ఈ పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు. ప్రతి పిల్లర్‌ను మూడు భాగాలుగా విభజించి, 20 నుంచి 24 వరకు విగ్రహాలను చెక్కుతున్నట్లు చెప్పారు. పిల్లర్ పైభాగంలో 8 నుంచి 12, మధ్యలో నాలుగు నుంచి ఎనిమిది, కింది భాగంలో నాలుగు నుంచి ఆరు విగ్రహాలను చెక్కుతారని రాయ్‌ పేర్కొన్నారు. ఒక్కో పిల్లర్‌పై విగ్రహాలను చెక్కేందుకు శిల్పులకు 200 రోజుల సమయం పడుతుందని తెలిపారు. అలాగే, రామ మందిరం పునాదిని రాతితో 15 అడుగుల లోతుతో నిర్మించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని