కేంద్రానికి రేపే ఆఖరి అవకాశం: రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే...

Updated : 02 Dec 2020 20:30 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. రేపటిలోగా చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. రేపు కేంద్రంతో మరోసారి రైతు సంఘాల ప్రతినిధులు భేటీ కానున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌ చేయడం గమనార్హం. ఈ మేరకు రైతు సంఘాల నేతలు బుధవారం మీడియాతో మాట్లాడారు.

తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దేశ రాజధానిలోని మిగిలిన రోడ్లనూ దిగ్బంధిస్తామని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని ప్రకటించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమం మరింత పెరిగి ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించారు. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దహనం చేస్తామన్నారు. చట్టాలను రద్దు చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టంచేశారు. అంతకుముందు 32 రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు.

రైతుల ఆదాయాన్ని సగం చేశారు: రాహుల్‌
నూతన వ్యవసాయ చట్టాల్ని ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల ఆదాయాల్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ‘సూట్‌-బూట్‌’ సర్కార్‌వి అన్నీ అబద్ధాలే అని నిరూపితమైందని విమర్శించారు. ‘‘ప్రభుత్వం చెప్పిందేమిటి.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని. కానీ చేసిందేమిటీ.. వారి అనుయాయుల సంపదను నాలుగింతలు పెంచి, రైతుల ఆదాయాన్ని సగానికి తగ్గించింది. ఈ సూట్‌-బూట్‌ సర్కార్‌ హామీలన్నీ అబద్ధాలే’’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్‌
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు. నల్లచట్టాలను అమలు చేస్తున్నారంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. దిగజారుడు రాజకీయాలు చేయొద్దని సూచించారు. ప్రస్తుతం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న సమయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను అమలు చేయడం రాష్ట్రాల చేతిలో లేదు. ఒకవేళ అదే అనుకుంటే.. రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కాకుండా కేంద్రంతో ఎందుకు చర్చలు జరుపుతారు’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

రైతుల ఆందోళనపై కంగన ట్వీట్‌.. మండిపడ్డ స్టార్స్‌
ముంబయి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రైతులకు మద్దతు పలుకుతూ పంజాబీ నటుడు దీప్‌ సింధు నిరసనలో పాల్గొన్నారు. ఆయన ఆందోళనలో పాల్గొనడం సిగ్గుపడాల్సిన విషయమని కంగన ట్వీట్‌ చేశారు. రైతుల పేరుతో కొందరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలకు నటి హిమాషీ ఖురానా స్పందిస్తూ.. ‘నీ ఆలోచనల పరంగా ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని భద్రత అడగొచ్చు.. కానీ వాళ్లు తమ హక్కుల గురించి ప్రశ్నించకూడదా..?’ అని కౌంటర్‌ ఇచ్చారు. ‘నీ పట్ల సిగ్గు పడుతున్నా సోదరి. ప్రజలకంటే ప్రధానమైంది ఏదీ లేదు. కావాలంటే నీ చుట్టూ ఉన్న వృద్ధులతో మాట్లాడు పరిస్థితి అర్థం అవుతుంది. ముంబయిలోని నీ కార్యాలయాన్ని కూల్చినందుకు కోపంతో అందరిపై చిందులేశావు. ఇక్కడ ప్రభుత్వం మా హక్కుల్ని చంపేస్తోంది’ అని పంజాబీ గాయకుడు అమీ విర్క్‌.. కంగన అభిప్రాయాల్ని తప్పుపట్టారు. పంజాబీ నటి సర్గున్ మెహతా కూడా కంగనపై మండిపడ్డారు. ‘అభిప్రాయాల్ని, ఆలోచనల్ని వ్యక్తపరిచే హక్కు నీకు ఉన్నట్లే.. వారికీ ఆ హక్కు ఉంది. కానీ ఇక్కడ ఒక్కటే తేడా.. నువ్వు ఎటువంటి లాజిక్‌ లేకుండా పిచ్చిగా మాట్లాడుతావు. కానీ వాళ్లు తమకు కావాల్సిన దాని కోసం అర్థవంతంగా పోరాడుతున్నారు’ అని సర్గున్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని