DK Shivakumar: కాంగ్రెస్‌ అభ్యర్థుల దరఖాస్తుల తిరస్కరణకు కుట్ర : డీకే శివకుమార్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో నానాటికి వేడి పెరుగుతోంది. అభ్యర్థుల దరఖాస్తుల్లోని లోపాలను సరిదిద్దేందుకు సీఎంఓ రిటర్నింగ్‌ అధికారులను పిలవటాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. 

Published : 22 Apr 2023 16:27 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka )లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల దరఖాస్తుల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు  ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) వివిధ జిల్లాల నుంచి రిటర్నింగ్‌ అధికారులను పిలవటాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ర్ట కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (D K Shivakumar) ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎంవోను విచారించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. సౌందట్టి నియోజకవర్గం నుంచి వచ్చిన భాజపా అభ్యర్థుల దరఖాస్తుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని.. అయితే వాటిని సరిచేయాలని అధికారులను పిలిచి మార్పులు చేయాలని సీఎం కార్యాలయం ఆదేశించింది. గతంలోనూ పలుమార్లు నా దరఖాస్తును కూడా తిరస్కరించేందుకు కుట్రలు జరిగాయి. దాని గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. నాకే ఇలా జరిగినప్పుడు ఇతర అభ్యర్థుల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. రిటర్నింగ్‌ అధికారాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసున్నారు. ఈసీ (EC) దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో విచారణ జరపాలి’ అని డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చిన అభ్యర్థుల నుంచి కాంగ్రెస్‌ లంచం వసూలు చేస్తోందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన ఆరోపణలకు ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. తమ పార్టీ ‘40 శాతం కమీషన్‌’ వసూలు చేయటం లేదని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. పార్టీ భవన నిర్మాణం కోసం మాత్రమే విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జనరల్‌ అభ్యర్థుల నుంచి రూ. 2 లక్షలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ. లక్షను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని