BSF: వీర జవాన్లతో.. పాక్‌, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్‌ షా

సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు.

Published : 01 Dec 2023 14:45 IST

రాంచీ: వచ్చే రెండేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో సంపూర్ణ భద్రత నెలకొంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. ఈ రెండు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మిగిలిపోయిన దాదాపు 60 కి.మీ మేర ఖాళీలను పూడ్చే పని జరుగుతోందన్నారు. బీఎస్‌ఎఫ్‌ 59వ రైజింగ్‌ డే (BSF Rising Day) సందర్భంగా ఝార్ఖండ్‌లోని ‘మేరు’ శిక్షణా శిబిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఇరుదేశాల సరిహద్దుల్లో దాదాపు 560 కిలోమీటర్ల మేర కంచె వేసిందని, మిగిలిన దాదాపు 60 కి.మీలు పనులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.

‘సరిహద్దులు సురక్షితంగా లేకపోతే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. అయితే, కేవలం కంచెలు మాత్రమే దేశాన్ని రక్షించవు. మన వీర బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఈ పని చేస్తున్నారు’ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. దేశంలో భాజపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడల్లా.. సరిహద్దు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ‘సరిహద్దుల్లో వాణిజ్యంతోపాటు రైలు, రోడ్డు, జలమార్గాలు, టెలిఫోన్ కమ్యూనికేషన్ అనుసంధానతను బలోపేతం చేశాం. 452 కొత్త సరిహద్దు పోస్టులను, 510 పర్యవేక్షణ టవర్లను ఏర్పాటు చేశాం. 637 సరిహద్దు పోస్టులకు కరెంటు కనెక్షన్‌, 500 పోస్టులకు నీటి సదుపాయం కల్పించాం’ అని వెల్లడించారు.

ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు

మావోయిస్టుల సాయుధ, హింసాత్మక ఉద్యమం నిర్మూలన దిశగా దేశం చేరువలో ఉందని అమిత్‌ షా తెలిపారు. గత పదేళ్లలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు 52 శాతం తగ్గాయని చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలకు సంబంధించిన 199 కొత్త శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తమ పాలనలో వామపక్ష తీవ్రవాదంతోపాటు జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాట్లపై విజయం సాధించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. దాదాపు 2.65 లక్షల సిబ్బంది ఉన్న ‘బీఎస్‌ఎఫ్‌’.. ప్రధానంగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో 6,386 కి.మీల పొడవైన భారత సరిహద్దుల్లో పహారా కాస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని