PM Modi: ఆర్టికల్ 370.. మోదీ ప్రసంగంలో యామీ గౌతమ్‌ సినిమా ప్రస్తావన

ప్రధాని మోదీ(Modi) నేడు జమ్మూలో పర్యటించారు. ఈసందర్భంగా ఆ ప్రాంతంలో చోటుచేసుకున్న అభివృద్ధి, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. 

Updated : 20 Feb 2024 15:00 IST

జమ్మూ: బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్(Yami Gautam) నటించిన ఆర్టికల్ 370(Article 370) గురించి ప్రధాని మోదీ(Modi) ప్రస్తావించారు. మంగళవారం జమ్మూ పర్యటనకు వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. అలాగే మౌలానా ఆజాద్‌ స్టేడియంలో నిర్వహించిన సభలోనూ ప్రసంగించారు.

‘ఆర్టికల్ 370 (Article 370)పై ఈ వారంలో ఒక సినిమా విడుదల కానుందని విన్నాను. అది మంచి విషయం. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ చిత్రం ఉపకరించనుంది. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధానమైన అవరోధంగా ఉండేది.  దానిని భాజపా తొలగించడంతో ఇప్పుడు ఈ ప్రాంతం సమతుల్యత దిశగా కదులుతోంది. దాని రద్దు తర్వాతే ఇక్కడి ప్రజలు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని పొందుతున్నారు’ అని మోదీ అన్నారు. అలాగే వారసత్వ రాజకీయాలపైనా విమర్శలు చేశారు.

కాలచక్రం మనవైపు మారింది

‘దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని జమ్మూకశ్మీర్ భరించాల్సి వచ్చింది. ఆ రాజకీయ నేతలు వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన భారత్ అంటే అభివృద్ధి చెందిన జమ్మూకశ్మీర్ కూడా అని తెలిపారు. గత పదేళ్లలో ఈ ప్రాంతంలో కొత్తగా 50 డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. అప్పట్లో పాఠశాలలకు నిప్పంటించేవారని, ఇప్పుడు అలంకరిస్తున్నారని అన్నారు.

‘ఆర్టికల్‌ 370’ సినిమా విషయానికొస్తే.. ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యాక్షన్‌ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకోనుంది యామీ. జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు