AAP: ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ

ఆమ్ఆద్మీ పార్టీ అక్రమ మార్గంలో కోట్ల రూపాయల విదేశీ నిధులను పొందిందని సోమవారం ఈడీ ఆరోపించింది.

Published : 20 May 2024 22:56 IST

దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌( ED) ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లను ఆప్‌ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. ఆప్‌ నాయకులు విదేశీ నిధుల సేకరణలో పలు అవకతవకలకు పాల్పడ్డారని, కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌తో సహా వారిలో కొందరు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని అధికారులు తెలిపారు. 

ఒకే నంబర్లకు విరాళాలు

దర్యాప్తు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అనేకమంది దాతలు ఒకే పాస్‌పోర్ట్ నంబర్‌లు, మెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్‌లు, క్రెడిట్ కార్డ్‌లకు పార్టీ ఫండ్‌ అందించారు. వీటికి సంబంధించిన వివరాలను దర్యాప్తు సంస్థ సేకరించింది.  ఈడీ ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 155 మంది 55 పాస్‌పోర్ట్ నంబర్‌ల ద్వారా మొత్తం రూ.1.02 కోట్లు, 71 మంది దాతలు 21 మొబైల్ నంబర్‌లను ఉపయోగించి మొత్తం రూ.99.90 లక్షలు,  మరో 75 మంది 15 క్రెడిట్ కార్డుల ద్వారా రూ.19.92 లక్షల విరాళాలను అందించారు. 

విదేశీ దాతల గుర్తింపు, జాతీయతలతో పాటు విదేశీ విరాళాలకు సంబంధించిన అనేక ఇతర వాస్తవాలను పార్టీ నేతలు దాచిపెట్టారని, అక్రమ మార్గంలో విరాళాలను సేకరించారని అధికారులు వెల్లడించారు. యూఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆప్‌ ఓవర్సీస్ ఇండియా (Overseas lndia) అనే సంస్థను ఏర్పాటుచేసిందని, పార్టీకి నిధులను సమీకరించడం దీని ప్రాథమిక పని అని పరిశోధనల్లో తేలిందన్నారు.

ఈడీ ఆరోపణలను ఆప్‌ కొట్టి పడేసింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి భయపడుతున్నారని పార్టీ నేత, దిల్లీ మంత్రి ఆతీషి (Atishi)  ఆరోపించారు. ‘‘ఇది ఈడీ చర్య కాదు భాజపా పని. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన కేసు. ఇందులో మేము ఈడీ, సీబీఐ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎన్నికల కమిషన్‌కు మా ప్రతిస్పందనలు తెలిపాము. ఎన్నికల సమయంలో ఆప్‌ పరువు తీసేందుకు మోదీ మరో కుట్ర చేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో మాపై ఇలాంటి అనేక తప్పుడు ఆరోపణలు వస్తాయి’’ అని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని