Mahadev Betting App Case: 4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. 

Published : 29 Apr 2024 12:23 IST

ముంబయి: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ (Sahil Khan) ఆదివారం అరెస్టయ్యారు. అయితే దీనిని తప్పించుకోవడానికి సినిమా లెవెల్‌లో అడ్వెంచర్ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ట్రాకింగ్ ముందు ఆయన ఆటలు సాగలేదు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సాహిల్.. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రాలు దాటడం మొదలుపెట్టారు. మొదట మహారాష్ట్ర నుంచి గోవా, అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్లారు. మళ్లీ తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషాలు మార్చారు. ముఖాన్ని స్కార్ఫ్‌తో దాచుకునేవారు. తర్వాత ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ పారిపోవాలని ప్లాన్‌ చేశారు. రాత్రి సమయంలో ఆ రాష్ట్రంవైపు ప్రయాణించడానికి సాహిల్ డ్రైవర్ అంగీకరించలేదు. అయినా తాను రోడ్డు మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే జాడ పసిగట్టిన పోలీసులు.. ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఐదు రాష్ట్రాల మీదుగా సుమారు 1,800 కి.మీ. ప్రయాణించినా, అరెస్టు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.

Mahadev Betting App Case: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ అరెస్ట్‌

పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన సాహిల్‌ (Sahil Khan).. ‘స్టైల్‌’, ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. సొంతంగా ఓ కంపెనీని స్థాపించి ఫిట్‌నెస్‌ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ కేసు (Mahadev Betting App Case)లో సాహిల్‌కు సిట్‌ 2023 డిసెంబరులోనే సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం యాప్‌నకు బ్రాండ్‌ ప్రమోటర్‌గా మాత్రమే పనిచేశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. యాప్‌ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్‌ యాప్‌ సహ-యజమానిగా చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని