Odisha Train Accident: ఆ చిన్నారులను ఆదుకుంటాం.. అదానీ, సెహ్వాగ్‌ల చొరవ!

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, మాజీ స్టార్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లు ముందుకొచ్చారు. వారికి ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.

Updated : 04 Jun 2023 22:21 IST

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident) వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందారు. ఇంకా వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంతోమంది తమ ఇంటి సభ్యులను, ఆత్మీయులను కోల్పోవడంతో.. వారి వేదన వర్ణనాతీతంగా మారింది. చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు బిలీయనీర్‌, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani), భారత క్రికెట్‌ మాజీ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag)లు ముందుకొచ్చారు. ఈ ఘటనతో అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్య (Free School Education)ను అందిస్తామని ప్రకటించారు.

‘ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలుసుకుని మేమంతా తీవ్ర మనోవేదనకు గురయ్యాం. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతలను తీసుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. పిల్లల భవిష్యత్తుతోపాటు బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత’ అని అదానీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఈ విషాద ఘటనతో అనాథలుగా మిగిలిన పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహిస్తా. వారికి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్య అందిస్తా’ అని సెహ్వాగ్‌ ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి, స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చిన వారికి, వైద్య బృందాలకు సెల్యూట్‌ చెప్పారు. రైలు ప్రమాదం అనంతరం ఒడిశావాసులు చూపిన మానవత ప్రశంసలు అందుకుంటోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని