Ladakh: తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో 68వేల మంది సైనికుల మోహరింపు

గల్వాన్‌ ఘటన తర్వాత ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులను తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణశాఖ కీలక వర్గాలు వెల్లడించాయి.

Published : 13 Aug 2023 21:20 IST

దిల్లీ: మూడేళ్ల క్రితం భారత్‌-చైనా సరిహద్దులోని గల్వాన్‌ (Galwan) లోయలో చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు పలుమార్లు సైనిక చర్చలు జరపడంతో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి. కానీ, ఊహించని పరిణామాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ఎవరికి వారు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ తూర్పు లద్దాఖ్‌ ప్రాంతానికి ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులను తరలించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రత్యర్థి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, చర్యలకు సిద్ధంగా ఉండేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన ఎస్‌యూ-30ఎంకేఐ, జాగ్వార్‌ యుద్ధవిమానాలను అక్కడికి పంపినట్లు తెలిపాయి.

మరోవైపు, జూన్‌ 15, 2020నాటి గల్వాన్‌ ఘటనను దృష్టిలో ఉంచుకున్న రక్షణశాఖ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి అప్పటికప్పుడు ఆయుధాలను, బలగాలను మోహరించడానికి వీలుగాని ప్రాంతాల్లో ముందుగానే యుద్ధ సామగ్రిని నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసింది. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్టింగ్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. ఇటీవల మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై డేగకన్ను ఉంచేందుకు పైలట్‌ లేకుండా నడిచే రిమోట్లీ పైలటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (RPA)ను కూడా భారత్‌ మోహరించింది. ఇది సరిహద్దు మార్గంలో సంచరిస్తూ.. చైనా సైన్యం కదలికలను గమనించి భారత్‌ అధికారులకు చేరవేస్తుంది. అవసరమైతే దాడి చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బెటాలియన్ల నుంచి 68 వేల మంది సైనికులను, 90కి పైగా యుద్ధ ట్యాంకులను, 330కిపైగా బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలతోపాటు, రేడార్‌ వ్యవస్థలు, అధునాతన తుపాకీలను కూడా వివాదాస్పద ప్రాంతాల్లో మోహరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటికి మరింత బలాన్ని చేకూర్చేలా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి.. సీ-130జే  సూపర్‌ హెర్కులస్‌, సీ-17 గ్లోబల్‌మాస్టర్‌ యుద్ధవిమానాలతోపాటు 9వేల టన్నుల ఆయుధ సామగ్రిని సిద్ధం చేసి ఉంచారు. ఎస్‌యూ-30 ఎంకేఐ, జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌లు 50 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు. అంతేకాకుండా ఆ పరిధిలో చైనా బలగాల కదలికలను పసిగట్టి ఇండియన్‌ ఆర్మీకి సమాచారం చేరవేస్తాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఎల్‌ఏసీ ప్రాంతంలో సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొని, శత్రువులను కదలికలను పర్యవేక్షించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని