Congress: యూపీలో కాంగ్రెస్‌ ‘ధన్యవాద్‌ యాత్ర’.. ఎందుకంటే?

సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఇండియా కూటమి 40కి పైగా స్థానాలు సొంతం చేసుకోవడంపై కాంగ్రెస్‌ హర్షం వ్యక్తంచేసింది. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనుంది

Published : 08 Jun 2024 19:35 IST

లఖ్‌నవూ: దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో భాజపా (BJP)కు కాస్త షాక్‌ తగిలింది. కాషాయ పార్టీకి పట్టున్న ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి అంచనాలకు భిన్నంగా ఎక్కువ సీట్లు దక్కించుకుంది. తమను గెలిపించిన యూపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్‌ (Congress) రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది.

యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్‌ యాత్ర’ పేరిట కాంగ్రెస్‌ యాత్రను చేపట్టనుంది. ఇది జూన్‌ 11న ప్రారంభమై 15న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రలో పార్టీ సీనియర్‌ నేతల నుంచి కార్యకర్తలు పాల్గోనున్నారు. రాష్ట్రంలోని ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. భారత రాజ్యాంగ ప్రతిని ఇచ్చి వారిని సత్కరించనున్నారు.

నీతీశ్‌కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌..!

80 ఎంపీ స్థానాలున్న యూపీలో విపక్ష ‘ఇండియా కూటమి’ 43 సీట్లు గెలుచుకోగా.. భాజపాకు 33 మాత్రమే దక్కాయి. సమాజ్‌వాదీ పార్టీ 37.. కాంగ్రెస్‌ 6 స్థానాలను సొంతం చేసుకున్నాయి. హస్తం పార్టీకి కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో భాజపా 62 స్థానాలు గెలుచుకోగా.. ఎస్పీ, కాంగ్రెస్‌లు వరుసగా ఒకటి, ఐదు స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా యూపీ ఎన్నికల్లో వచ్చిన ఈ గణనీయమైన మార్పుపై కూటమి హర్షం వ్యక్తంచేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని