Nitish Kumar: నీతీశ్‌కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌..!

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చినట్లు జేడీ(యూ) నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ స్పందించింది. 

Updated : 08 Jun 2024 16:55 IST

దిల్లీ: కేంద్రంలోని భాజపాను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కు ప్రధాన మంత్రిగా ఆఫర్‌ ఇచ్చినట్లు జేడీ(యూ) వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆయన మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘‘ఇండియా కూటమి నీతీశ్‌ కుమార్‌కు ప్రధాన మంత్రిగా ఆఫర్‌ ఇచ్చింది. ఆయన మాత్రం ఆ అవకాశాన్ని తిరస్కరించారు. దీని గురించి నేరుగా నీతీశ్‌ను కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మేము ఎన్డీయే కూటమితో ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు’’ అని త్యాగి పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించగా.. ఇండియా కూటమి ఆ అంచనాలకు మించి 234 స్థానాలను సొంతం చేసుకుంది.

అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకు ఫర్వాలేదా?: కంగనా ఆగ్రహం

ఈ క్రమంలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఇండియా కూటమి తన సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని వార్తలు వినిపించాయి. అందుకోసం ఎన్టీయే మిత్రపక్షాలైన తెలుగు దేశం పార్టీ, జేడీ(యూ)లను తమ కూటమిలో చేర్చుకునేందుకు యత్నించిందని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నీతీశ్‌కు వచ్చిన ఆఫర్ గురించి తాజాగా పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘‘నీతీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించడంపై కాంగ్రెస్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసు’’ అని హస్తం పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని