Arvind Kejriwal: కేజ్రీవాల్‌ నిఘా నీడలో ఈడీ అధికారులు..?

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇంట్లో జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలను గుర్తించినట్లు సమాచారం. 

Published : 22 Mar 2024 18:51 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టయిన సంగతి తెలిసిందే. దానికి ముందు ఈడీ(ED) అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేసి, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కీలక విషయాలను గుర్తించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ సోదాల సందర్భంగా అధికారులు 150 పేజీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో దర్యాప్తు సంస్థకు చెందిన ఇద్దరు అధికారుల గురించి కీలక సమాచారం ఉందని గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ ర్యాంకు అధికారుల గురించిన సమాచారం ఉందని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లు గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు ప్రస్తుత సోదాల్లో పాల్గొన్నారని, ఆ పత్రాల్లో ఉన్న వివరాలను చూసి ఈడీ అధికారులు షాక్‌కు గురయ్యారని తెలిపాయి. వెంటనే వాటిని సీజ్‌ చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ వివరాలను సేకరించడం వెనక ఉన్న ఉద్దేశాలపైనా ఆరా తీయనున్నారు.

మద్యం కేసులో ‘కింగ్‌పిన్‌’ ఆయనే.. కోర్టుకు వెల్లడించిన ఈడీ

సీఎం అరెస్టుతో దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఈ కేసులో ఆయనకు రిమాండ్‌ విధించినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్‌ నేతలు వెల్లడించారు. ఇదిలాఉంటే.. మద్యం కుంభకోణం కేసులో ఆయన కీలక సూత్రధారి అని, ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని