Arvind Kejriwal: మద్యం కేసులో ‘కింగ్‌పిన్‌’ ఆయనే.. కోర్టుకు వెల్లడించిన ఈడీ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది.

Updated : 22 Mar 2024 16:20 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి (Excise policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు.

‘‘మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్‌. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి’’ అని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal: సుప్రీంలో పిటిషన్‌ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్‌

అరెస్టుపై కేజ్రీవాల్‌ ఫస్ట్‌ రియాక్షన్‌..

తన అరెస్టుపై కేజ్రీవాల్‌ తొలిసారిగా స్పందించారు. ‘‘ఈ దేశానికి సేవ చేసేందుకు నా జీవితం అంకితం చేశా. జైల్లో ఉన్నా బయట ఉన్నా అది కొనసాగిస్తా’’ అని కోర్టు హాలుకు వెళ్తూ ఆయన మీడియాతో అన్నారు.

కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిటిషన్‌..

సీఎం అరెస్టుతో దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఈ కేసులో ఆయనకు రిమాండ్‌ విధించినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్‌ నేతలు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషనర్‌ కోరారు.

కేజ్రీవాల్‌ ఓ వ్యక్తి కాదు.. సిద్ధాంతమని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు. ఆప్‌ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయని చెప్పారు. అరెస్టు నేపథ్యంలో ఆయన శుక్రవారం దిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకుని మాట్లాడారు. అంతకుముందు ఆప్‌ నేతలు రోడ్డెక్కారు. భాజపా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనలు చేపట్టిన మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని