Air Force: ఒక్కసారి గాల్లోకి ఎగిరితే.. చైనా, పాక్‌ సరిహద్దులను చుట్టేస్తుంది..!

తాజాగా భారత వాయుసేన సాయుధ డ్రోన్లను సరిహద్దుల వద్దకు తరలించింది. ఓ ఆంగ్ల వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ డ్రోన్లు ఒక్కసారి గాల్లోకి ఎగిరితే 36 గంటలపాటు ప్రయాణించగలవు. 

Published : 13 Aug 2023 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా, పాక్‌ సరిహద్దుల వద్ద మోహరింపులను భారత్‌ బలోపేతం చేస్తోంది. తాజాగా వాయుసేన నాలుగు హెరాన్‌ మార్క్‌-2 సాయుధ డ్రోన్లను నార్తన్‌ సెక్టార్‌లోని సరిహద్దు స్థావరాల వద్ద మోహరించింది. ఇవి లాంగ్‌రేంజ్‌ క్షిపణులను కూడా ప్రయోగించగలవు. తాజాగా ఓ ఆంగ్ల వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ డ్రోన్లకు ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ఉండటంతో నియంత్రణ మరింత సులభం కానుంది. అత్యంత సుదూర ప్రాంతాల నుంచి వీటిని ఆపరేట్‌ చేయవచ్చు. ఇది ఒక్కసారి గాల్లోకి ఎగిరితే ఏకంగా 36 గంటలపాటు ప్రయాణిస్తుంది. ఈ డ్రోన్‌లోని ప్రత్యేకమైన లేజర్‌ శత్రు లక్ష్యాలను గుర్తిస్తుంది. దీంతో మన ఫైటర్‌జెట్లు ఆ లక్ష్యాలపై ప్రత్యేకమైన ఆయుధాలతో దాడి చేయడం సులువుగా మారుతుంది.

‘ఆ హద్దులు...’ ప్రమాద పొద్దులు

‘‘హెరాన్‌ మార్క్‌ 2 డ్రోన్లు చాలా శక్తిమంతమైనవి. సుదీర్ఘ సమయం ఇవి గాల్లో ఉండగలవు. సాధారణ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా పసిగట్టగలవు. ఫలితంగా ఆ ప్రదేశం మొత్తంలో ఏ జరుగుతోందో గుర్తించగలవు’’ అని డ్రోన్‌ స్క్వాడ్రన్‌ వింగ్‌కమాండర్‌ పంకజ్‌ రాణా పేర్కొన్నారు. దీంతోపాటు ఒక ఆపరేషన్లో భాగంగా పలు ప్రదేశాలకూ వీటిని పంపవచ్చన్నారు. భారత వాయుసేన పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్‌ సేకరణకు ఇది సరిపోతుందన్నారు. టార్గెట్లపై నిరంతరం నిఘా పెట్టడం దీని అదనపు బలమని రాణా చెప్పారు. ఒక సారి సార్టీవెళితే చైనా, పాక్‌ కదలికలను గుర్తించి రాగలదన్నారు. ఎయిర్‌ టు ఎయిర్‌, ఎయిర్‌ టు గ్రౌండ్‌ క్షిపణులు, ప్రత్యేకమైన బాంబులను ఇది తీసుకెళ్లగలదు. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా పనిచేయగలగడం ఈ డ్రోన్‌ ప్రత్యేకత.  

పాకిస్థాన్‌ , చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌లో శక్తిమంతమైన మిగ్‌-29 యుద్ధ విమానాలను మోహరించింది. ఇప్పటివరకు ఈ ఎయిర్‌బేస్‌లో ‘మిగ్‌-21’ విధులు నిర్వహించగా.. ఇప్పుడు వాటి స్థానంలో మిగ్‌-29 విమానాలను దింపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని