Devaraje Gowda: ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!

ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.

Published : 11 May 2024 00:20 IST

బెంగళూరు: ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాసన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికే ముందే.. ప్రజ్వల్‌ దారుణాల గురించి భాజపా అధిష్ఠానాన్ని ఆయన అప్రమత్తం చేసినట్లు ఇటీవలే తెలిసింది.

భాజపాకు చెందిన దేవరాజే గౌడ ఓ న్యాయవాది. ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే, హాసన జిల్లాకు చెందిన ఓ మహిళ (36).. తనను దేవరాజే మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిని విక్రయించడంలో సాయం చేస్తాననే నెపంతో తనను వేధించాడని అందులో ఆరోపించారు.

మరోవైపు ప్రజ్వల్‌కు సంబంధించి లీకైన వీడియోల వ్యవహారంలో దేవరాజేపై ఆరోపణలు వచ్చాయి. దేవెగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేవరాజే గౌడకు ప్రజ్వల్‌ వీడియోలు, ఫొటోలు ఇచ్చానని.. రేవణ్ణ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన కార్తిక్‌ అనే వ్యక్తి ఆరోపించాడు. అయితే, కార్తిక్‌ చేసిన ఆరోపణలను దేవరాజే తోసిపుచ్చారు. జేడీఎస్‌, భాజపా నేతలెవరూ ఆ వీడియోలు విడుదల చేయలేదని.. కాంగ్రెస్‌ నేతలే వాటిని విడుదల చేసి ఉంటారని ఆరోపణలు చేయడం గమనార్హం. సిట్‌ నోటీసులు ఇస్తే తన వద్ద ఉన్న ఆధారాలు అప్పగిస్తానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు