IAF: తొలి సీ-295 భారత్‌కు వచ్చేస్తోంది.. స్పెయిన్‌లో అప్పగింతలు పూర్తి

భారత (India) రక్షణశాఖతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్పెయిన్‌కు (Spain) చెందిన ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక తొలి రవాణా విమానాన్ని (C295 transport aircraft) భారత వైమానిక దళం (IAF) అందుకుంది.  

Published : 13 Sep 2023 18:24 IST

మాడ్రిడ్ : స్పెయిన్‌కు (Spain) చెందిన ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ రూపొందించిన సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని (C295 transport aircraft) భారత్‌కు అప్పగించింది. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం రూ.21,935 కోట్ల ఒప్పందం జరిగింది. అందులో భాగంగా తయారైన తొలి విమానాన్ని దక్షిణ స్పానిష్‌ నగరమైన సెవిల్లెలోని ఏరోస్పేస్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి అందుకున్నారు. ఇవాళ ఆయన అందులో ప్రయాణించనున్నారు. భారత్‌ చేరుకున్న తరువాత ఈ విమానాన్ని ఈ నెల 20న హిండన్‌ ఎయిర్‌బేస్‌లో అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఒప్పందంలో భాగంగా ఎయిర్‌ బస్‌ 2025 నాటికి ‘ఫ్లై అవే’ కండిషన్‌లో ఉన్న 16 విమానాలను డెలివరీ చేస్తుంది. మిగిలిన 40 విమానాల అమరిక, తయారీ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌)లో జరుగుతుంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఖరారైంది. 

సైనికుడిని కాపాడేందుకు.. ప్రాణ త్యాగం చేసిన శునకం..

గతేడాది అక్టోబరులో వడోదరలో ‘295 విమానాల’ తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్‌ కన్సార్టియం ద్వారా తయారయ్యే మొదటి సైనిక విమానం ఇది. భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాల కిందట అవ్రో-748 విమానాలను ప్రవేశపెట్టారు. వాటిని సీ-295 విమానాలతో భర్తీ చేయనున్నారు. సీ-295 కోసం 39 ఆపరేటర్ల నుంచి 280 దాకా ఆర్డర్లు వచ్చాయని తయారీ కంపెనీ పేర్కొంది. దాంతో ఇది బరువు, మిషన్‌ క్లాస్‌లో ఓ సాటిలేని విమానంగా మారిందని వెల్లడించింది. 5-10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌ 71మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. అలాగే, ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు. ఈ విమానం ప్రత్యేక మిషన్లతోపాటు విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను నిర్వహించగలదు. 

సెవిల్లెలో తొలి విమానాన్ని మేలోనే రూపొందించగా.. రెండో విమానం తయారీ దశలో ఉంది. వచ్చే ఏడాది మేలో ఆ విమానం భారత వైమానిక దళానికి స్పెయిన్‌ కంపెనీ అందజేయనుంది. భారత వైమానిక దళానికి చెందిన ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సివిల్లెలో శిక్షణ పూర్తి చేసుకొన్నారు. వచ్చే ఏడాది నవంబరు నుంచి వడోదరలో సీ-295 విమానం అసెంబ్లింగ్‌ కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత వైమానిక దళం ప్రపంచంలోనే అతిపెద్ద సీ-295 ఆపరేటర్‌ అవుతుందని ఓ అధికారి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని