Mani Shankar Aiyar: 1962లో భారత్‌పై చైనా దాడి ‘ఆరోపణలేనట’.. మణిశంకర్‌ అయ్యర్‌ మరో దుమారం

Mani Shankar Aiyar: కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి చైనా దాడిని ‘ఆరోపణ’గా అభివర్ణించారు.

Published : 29 May 2024 11:05 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌ (Congress)కు తలనొప్పిగా మారాయి. మొన్నటికి మొన్న పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ (Mani Shankar Aiyar) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మరో వివాదానికి తెరలేపారు. భారత్‌పై చైనా (China) దాడి చేయలేదని కేవలం ఆరోపణలు ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిల్లీలో మంగళవారం సాయంత్రం ‘నెహ్రూస్‌ ఫస్ట్‌ రిక్రూట్స్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో మణిశంకర్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 1962 నాటి భారత్‌-చైనా యుద్ధం (1962 India-China War) గురించి ప్రస్తావిస్తూ.. ‘నాడు భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలు ఉన్నాయి’ అని అన్నారు. అయితే, వాస్తవంగా జరిగిన దాడిని అయ్యర్‌ ‘ఆరోపణ’ అని పేర్కొనడం దుమారం రేపింది.

ఇండియా Vs చైనా సైన్యం.. ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో విజయం మనదే

దీనిపై భాజపా (BJP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు వచ్చే శాశ్వత స్థానాన్ని నాడు నెహ్రూ చైనా కోసం వదిలేశారు. రాహుల్‌ గాంధీ ఆ దేశంతో రహస్యంగా ఒప్పందాలు చేసుకోవడంతో రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చైనా ఎంబసీ నుంంచి నిధులు వస్తున్నాయి. మన పరిశ్రమలను దెబ్బకొడుతూ యూపీఏ హయాంలో సోనియా గాంధీ చైనా ఉత్పత్తులకు ఇక్కడ మార్కెట్‌ అవకాశాలు కల్పించారు. ఇప్పుడేమో మణిశంకర్‌ అయ్యర్‌.. 38000 చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న నాటి చైనా దండయాత్రను చరిత్ర నుంచి తుడిచేయాలని అనుకుంటున్నారు’’ అని భాజపా నేత అమిత్‌ మాలవీయ మండిపడ్డారు.

ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్‌ దీనిపై వివరణ ఇచ్చింది. ‘‘చైనా దాడికి మణిశంకర్‌ అయ్యర్‌ పొరబాటుగా ‘ఆరోపణ’ అనే పదాన్ని ఉపయోగించారు. ఇందుకు వెంటనే క్షమాపణలు తెలియజేశారు. ఈ వివాదానికి కాంగ్రెస్‌ దూరంగా ఉంటుంది. 1962లో భారత్‌పై చైనా జరిపిన దాడి వాస్తవమే. అలాగే 2020 మే నెలలోనూ లద్ధాఖ్‌లో చైనా ఆక్రమణలకు ప్రయత్నించింది. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది మన జవాన్లు అమరులయ్యారు. కానీ, నాటి చైనా చొరబాట్లను ప్రధాని మోదీనే స్వయంగా ‘ఆరోపణ’గా అభివర్ణించి ఆ దేశానికి క్లీన్‌చిట్ ఇచ్చారు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేష్‌ సమర్థించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని