Ajit Pawar: మోదీ క్యాబినెట్‌లో స్థానం దక్కని వేళ.... శరద్‌ పవార్‌కు అజిత్‌ కృతజ్ఞతలు

తన బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ వర్గంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వైఖరి మారినట్లు కన్పిస్తోంది. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన శరద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 11 Jun 2024 12:22 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గానికి షాక్‌ ఇచ్చాయి. ఎన్సీపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ఫలితాలతో తన బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గంపై తన వైఖరి మారినట్లు కన్పిస్తోంది. ఎన్సీపీ స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న అజిత్‌.. శరద్‌ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘1999లో స్థాపించిన ఎన్సీపీ ఎంతో ప్రజాదరణ సొంతం చేసుకుంది. 24 ఏళ్లుగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిన శరద్‌ పవార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని పేర్కొన్నారు. కేంద్రంలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వంలో తమ వర్గానికి క్యాబినెట్‌ పదవి దక్కకపోవడాన్ని ఉద్దేశిస్తూ అజిత్‌ మాట్లాడారు. ‘‘కేంద్రంలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎన్సీపీకి అవకాశాలు వచ్చాయి. కానీ, క్యాబినెట్‌ కంటే తక్కువ స్థాయి పదవిలో మేము కొనసాగలేమని ఇప్పటికే భాజపాకు స్పష్టం చేశాం. మా పార్టీ ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే. భవిష్యత్తులో మా కూటమి 300 మార్క్‌ను దాటడం ఖాయం’’ అని అన్నారు.

కీలక శాఖలు భాజపాకే

గతంలో క్యాబినెట్‌ మంత్రిగా పని చేసిన తాను.. ఇప్పుడు సహాయక మంత్రిగా వ్యవహరించి తన స్థాయి తగ్గించుకోలేనని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ పదవిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా.. మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాలు ఉండగా.. ఎంవీయే పక్షాలతో కలిసి 10 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ (ఎస్పీ) ఎనిమిదింటిని గెలుచుకుంది. దీంతో అసలైన ఎన్సీపీ తమదేనని శరద్‌ పవార్‌ నిరూపించున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

వాటిపై దృష్టి పెడతాం..

ఐదు స్థానాల్లో పోటీ చేసిన అజిత్‌ పవార్‌ ఎన్సీపీ.. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే అజిత్‌ పవార్‌ బాబాయ్‌కు కృతజ్ఞతలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి తగిలిన ఎదురుదెబ్బపై స్పందించిన ఆయన.. ఎన్సీపీలోని అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తామని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని