Kashi Vishwanath temple: కాశీలో పోలీసులకు ధోతీ-కుర్తా.. వివాదంలో యోగి సర్కారు

Kashi Vishwanath temple: కాశీ విశ్వనాథుని ఆలయంలో పోలీసులు సంప్రదాయ ధోతీ-కుర్తాలో కన్పించడం విమర్శలకు దారితీసింది. ఇది ఆమోదయోగ్యం కాదని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ ఖండించారు.

Published : 12 Apr 2024 13:58 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని వారణాసి (Varanasi)లో గల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయం (Kashi Vishwanath temple) వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని వెల్లడించింది. దీనిపై వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఆలయ ప్రాంగణం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ-కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో అర్చకుల వస్త్రధారణలో కనిపించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ (Akhilesh Yadav) దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పోలీసులు అర్చకుల మాదిరిగా డ్రెస్‌ కోడ్‌ ధరించాలని ఏ పోలీసు మ్యానువల్‌లో ఉంది? ఈ ఉత్తర్వులు ఇచ్చిన వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలి. ఒకవేళ రేపు ఎవరైనా దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడితే? ప్రజలను దోపిడీ చేస్తే? యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?’’ అని ప్రశ్నించారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ యోగి సర్కారుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌’ కేసులో..టోపీ ఆధారంగా బాంబర్‌ అరెస్ట్‌..!

ఈ నిర్ణయాన్ని కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ మాత్రం సమర్థించుకున్నారు. ‘‘ఆలయాల్లో విధి నిర్వహణ మిగతా ప్రాంతాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ రద్దీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించదు. అయితే భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్ని సార్లు పోలీసులు వ్యవహరించే తీరు ప్రజలకు బాధ కలిగించొచ్చు. అదే వారు అర్చకుల మాదిరిగా కనిపిస్తే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ డ్రెస్‌కోడ్‌ను మార్చాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని