BJP: భాజపా తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

Akshay Kumar-Kangana Ranaut: బాలీవుడ్‌ నటులు కంగనా రనౌత్‌, అక్షయ్‌ కుమార్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. భాజపా ప్రకటించే అభ్యర్థుల తొలి జాబితాలో వీరి పేర్లు ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Updated : 02 Mar 2024 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలు (Lok sabha Elections 2024) సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికకు భాజపా (BJP) ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే తొలి జాబితాను ప్రకటించనుంది. ఈ లిస్ట్‌లో కొత్త వ్యక్తులు, యువ నేతలకు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ నటులు కంగనా రనౌత్‌ (Kangana Ranaut), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)ను బరిలో దించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

తొలి జాబితాలోనే వీరిద్దరు పేర్లు ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి అక్షయ్‌ కుమార్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనాను నిలబెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇటీవల కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె భాజపాలో చేరితే స్వాగతిస్తామని గతంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అటు అక్షయ్‌ కుమార్‌ కూడా వివిధ సందర్భాల్లో భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు.

భాజపా తొలి జాబితాలో 110 పేర్లు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధాని మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల కీలక సమావేశం నిర్వహించింది. అభ్యర్థుల తొలి జాబితాను సత్వరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా 110కి పైగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. చాలా చోట్ల సిట్టింగ్‌ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. కొత్త ముఖాలకూ అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని