భాజపా తొలి జాబితాలో 110 పేర్లు!

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 02 Mar 2024 06:30 IST

 16 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి?
తెల్లవారుజాము దాకా కొనసాగిన చర్చలు

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి 10.30కు మొదలైన ఈ భేటీలో దాదాపు 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై శుక్రవారం తెల్లవారుజాము నాలుగింటి వరకు కమిటీ చర్చలు జరిపింది. ఈ సమావేశానికి ముందే హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రధాని నివాసంలో మోదీని కలిసి చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల తొలి జాబితాను సత్వరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా 110కి పైగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. చాలాచోట్ల సిటింగ్‌ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాజా చర్చల్లో యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, గోవా, ఉత్తరాఖండ్‌లోని స్థానాలపై ముందుగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో సీట్లపై స్థానిక ప్రాంతీయ పార్టీలతో అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన ఉండవచ్చు.

వారణాసి నుంచి మోదీ మూడోసారి..

ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి 2014లో 3.7 లక్షలు, 2019లో 4.8 లక్షల మెజార్టీతో ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి వారణాసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా (గాంధీనగర్‌), రాజ్‌నాథ్‌ సింగ్‌ (లఖ్‌నవూ) తమ పాత స్థానాల నుంచే మళ్లీ బరిలోకి దిగనున్నారు. అలాగే అమేఠీ స్థానంపైనా సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ స్మృతి ఇరానీయే మళ్లీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎంపీల పనితీరు, రాజకీయ అవసరాల దృష్ట్యా గణనీయ సంఖ్యలో ప్రస్తుత సభ్యులను పక్కనపెట్టే అవకాశాలున్నాయి. భాజపాకు కీలక మిత్రపక్షాలు ఉన్న బిహార్‌, మహారాష్ట్రలతోపాటు పొత్తుల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఇంకా చర్చకు రాలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మిత్రపక్షాలకు 6 స్థానాలు కేటాయించే అవకాశముంది. అధికారికంగా ఇంకా కమలదళంతో కలవని జయంత్‌సింగ్‌ సారథ్యంలోని ఆర్‌ఎల్‌డీ వాటా కూడా ఇందులో ఉంది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి మూడుసార్లు కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచిన శశిథరూర్‌పై ఈసారి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ బరిలోకి దిగే అవకాశమున్నట్లు వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని