Rafah: ఇది యుద్ధం కాదు.. మారణహోమం: కాల్పుల విరమణకు గళమెత్తిన ఇండియన్‌ సెలబ్రిటీలు

రఫా(Rafah)పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కాల్పుల విరమణకు తమ గళమెత్తారు. 

Updated : 29 May 2024 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: రఫా(Rafah) నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దృశ్యాలు ప్రతిఒక్కరినీ కలిచివేస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఆన్‌లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘All Eyes On Rafah’ పదం ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం జరుగుతోన్న పోరు గురించి అవగాహన కల్పించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు.

మనదేశానికి చెందిన ప్రముఖ నటీనటులు..‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’తో ఉన్న ఇమేజ్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి, కాల్పులు విరమణకు అభ్యర్థించారు. సమంత, త్రిష, మాళవికా మోహనన్‌, రష్మిక, దుల్కర్ సల్మాన్‌, పార్వతి తిరువొత్తు, అమీ జాక్సన్, అలియా భట్‌, కరీనాకపూర్‌, ప్రియాంకా చోప్రా, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, త్రిప్తి డిమ్రి, రిచా చద్దా పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభాన్ని తెలిపిన వారిలో ఉన్నారు. ‘‘ఇది ఘర్షణ కాదు..యుద్ధం కాదు.. మారణహోమం’’ అంటూ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఒక తల్లిగా రఫాలో పిల్లలు మరీ ముఖ్యంగా అనాథలు అనుభవిస్తోన్న వేదన ఊహకందనిది. మన సమాజం నైతికమార్గాన్ని అనుసరించడం లేదు. మేం కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాం. మౌనంగా ఉండొద్దు. పాలస్తీనా ప్రజలు అనుభవిస్తోన్న బాధ నుంచి మన ప్రభుత్వాల దృష్టి మరల్చకుండా చూడాలి. అమాయక ప్రజల హత్యల విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండదు’’ అని అమీ జాక్సన్ తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది.. ఇజ్రాయెల్‌పై అగ్రరాజ్యం ఆగ్రహం!

గాజాలో కాల్పుల విరమణ పిలుపునిస్తూ ఉన్న ఒక పోస్టును సమంత రీషేర్ చేశారు. చిన్నారులందరూ ప్రేమ, రక్షణ, శాంతి, సురక్షిత జీవనానికి అర్హులు అంటూ ఆలియా ఇన్‌స్టా స్టోరీలో అలియా రాసుకొచ్చారు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక.. పాలస్తీనా విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ‘All Eyes On Rafah’ అనే ఇమేజ్‌ను షేర్ చేశారు.

రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది. వాస్తవానికి దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలి వచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్‌ దాడి చేయడం గమనార్హం. తమ దాడిలో సామాన్య పౌరులు మృతి చెందడంపై నెతన్యాహు కూడా విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెలీలకు వ్యతిరేకంగా ఉగ్రదాడులు అమలు చేస్తోన్న ఇద్దరు హమాస్‌ నేతలు ఈ ప్రాంతంలో నక్కినట్లు తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని, దాని ఆధారంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే, ఊహించని పరిస్థితుల కారణంగా జరిగిన ప్రమాదంలో గాజా పౌరులు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. తాము టార్గెట్‌ చేసిన ప్రాంతంలో హమాస్‌ ఆయుధాలు భద్రపర్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని