Parliament: ‘కాంగ్రెస్‌ గడ్డి’ అంటే అలర్జీ.. పీయూష్‌ గోయల్‌ చురకలు!

రాజ్యసభ పక్ష నేత పీయూష్‌ గోయల్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ గడ్డి’ అంటే తనకు అలర్జీ అని పరోక్షంగా చురకలంటించారు.

Published : 21 Dec 2023 19:57 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్షనేత పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ గడ్డి (Congress Grass)’ అంటే తనకు అలర్జీ అని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దేశంలోని అడవులపై ప్రతికూల ప్రభావం చూపుతోన్న మొక్కల నిర్మూలనపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ రాజ్యసభలో మాట్లాడారు. ఈ క్రమంలోనే పీయూష్‌ గోయల్‌ ‘కాంగ్రెస్‌ గడ్డి’ అంశాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ‘కాంగ్రెస్‌ గడ్డి’ ఒక రకమైన కలుపు మొక్క. తెలుగులో దీన్ని ‘వయ్యారిభామ’ అని పిలుస్తుంటారు.

‘‘నాకు ‘కాంగ్రెస్ గడ్డి’ అంటే అలర్జీ. వైద్యులు ఇదే విషయాన్ని తెలిపారు’’ అని కాంగ్రెస్ పార్టీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే పీయూష్‌ గోయల్‌ చురకలంటించారు. అయితే, అది ఏ విధంగా ప్రమాదకరమో వివరించాలని మంత్రిని కోరారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ స్పందిస్తూ.. ‘సంబంధిత మంత్రి (భూపేందర్‌ యాదవ్‌).. ఆ కలుపు మొక్క పెద్ద తలనొప్పిగా మారిన ప్రాంతం (రాజస్థాన్‌) నుంచే వచ్చారు. దాని గురించి పూర్తి అవగాహన ఉంది. మీరు మంత్రితో విడిగా మాట్లాడండి. ఆయన పరిష్కారం కూడా చెబుతారు’ అని సరదాగా సూచించారు.

అలజడి ఘటన.. పార్లమెంట్‌ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..!

ఆ కలుపు మొక్క గురించి సభలో ఉన్నవారందరికీ అవగాహన కల్పించాలని పీయూష్‌ కోరారు. అయితే.. తాను ఛైర్మన్‌ ఆదేశాలను పాటిస్తానని, గోయల్‌ను విడిగా కలిసి అంతా వివరిస్తానని యాదవ్‌ చెప్పారు. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి ‘కాంగ్రెస్ గడ్డి’ (పార్థీనియం హిస్టెరోఫోరస్) 1950వ దశకంలో భారత్‌ చేరింది. ఆహార ధాన్యాల దిగుమతుల ద్వారా ఈ కలుపు మొక్క భారత్‌కు చేరుకున్నట్లు నివేదికలు ఉన్నాయి. పంట దిగుబడులపై ప్రభావం చూపడంతోపాటు మనుషుల అనారోగ్యానికి కూడా ఇది కారణమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని