Viral news: రాంగ్‌ రూట్‌లో వచ్చి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి పైలట్‌ వాహనం

కేరళ మంత్రి కాన్వాయ్‌లోని పైలట్‌ వాహనం అంబులెన్స్‌ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Published : 14 Jul 2023 18:38 IST

తిరువనంతపురం: కేరళ విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ కాన్వాయ్‌లోని పైలట్‌ వాహనం బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే కూడలిలో రాంగ్‌ రూట్‌లో వచ్చి అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న రోగి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడే ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తిరువనంతపురంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంబులెన్స్‌ డ్రైవర్‌తోపాటు పైలెట్‌ వాహన చోదకుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరువనంతపురంలోని ఓ రద్దీ కూడలి మీదుగా మంత్రి శివన్‌కుట్టీ కాన్వాయ్‌ ప్రయాణించాల్సి వచ్చింది. కాన్వాయ్‌  వస్తున్న సమయంలో అప్రమత్తమైన పోలీసులు కూడలిలో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఓ బైకర్‌ దాదాపు కూడలి మధ్య వరకు వచ్చేసి పోలీసుల సంజ్ఞ మేరకు నిలిచిపోయాడు. సాధారణంగా రోడ్డుకు ఎడమవైపు నుంచి రావాల్సిన మంత్రి కాన్వాయ్‌.. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు కుడివైపు నుంచి వచ్చింది. అదే సమయంలో వేరే వైపు రోడ్డు నుంచి వేగంగా వస్తున్న అంబులెన్స్‌ కూడలి దాటే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పైలట్‌ వాహనం అంబులెన్స్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో అది బోల్తా కొట్టి ఆమడదూరం దొర్లుకుంటూపోయింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టబోగా.. అతడు రెండుసార్లు చాకచక్యంగా తప్పించుకున్నాడు. పైలట్‌ వాహనం ఎదురుగా ఉన్న బైకర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది.  మంత్రి వాహనం మాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై మంత్రి శివన్‌శెట్టి ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని