సైన్యం ప్రాణ త్యాగాలు గణాంకాలుగానే మిగిలిపోకూడదు: ఆనంద్‌ మహీంద్రా ఎమోషనల్ పోస్టు

కశ్మీర్‌(Jammu and Kashmir)లోని రాజౌరీ జిల్లా కాలాకోట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) గుర్తు చేసుకున్నారు. 

Updated : 24 Nov 2023 14:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని రాజౌరీ జిల్లా కాలాకోట్‌ అడవుల్లో రెండు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనిక సిబ్బంది అమరులయ్యారు. రాజౌరీ జిల్లాలోని రోమియో ఫోర్స్ కార్యాలయంలో ఉంచిన వారి భౌతికకాయాలకు ఆర్మీ అధికారులు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వారి ధైర్యసాహసాలను కొనియాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) ట్విటర్ వేదికగా భావోద్వేగ పోస్టును పెట్టారు.

‘వారి త్యాగాలు కేవలం గణాంకాలుగా మిగిలిపోకూడదు. పండుగలు, స్టాక్‌ మార్కెట్‌, క్రికెట్ మ్యాచ్‌లు, ఇలా పలు విషయాల్లో నిమగ్నమైన మమ్మల్ని సురక్షితంగా ఉంచేందుకు మీ ప్రాణాలు పణంగా పెట్టడానికి అంతులేని ధైర్యం అవసరం. ఇంతగా ధైర్యసాహసాలు చూపిన వారు నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. కానీ, వారు గుర్తింపులేకుండా వెళ్లిపోకూడదు. వారికి నా సెల్యూట్. ఓం శాంతి’ అంటూ  మహీంద్రా(Anand Mahindra) ఆ అమర జవాన్లకు నివాళి సమర్పించారు. వారికి వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలను షేర్ చేశారు.

డీప్‌ఫేక్‌లపై కొరడా

కాలాకోట్ అడవుల్లో బుధవారం ఈ ఎన్‌కౌంటర్ మొదలైంది. ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడంతో రెండురోజుల తర్వాత ఈ ఆపరేషన్ ముగిసింది. ఈ క్రమంలో ఇద్దరు యువ కెప్టెన్లు (ఎంవీ ప్రంజల్‌, శుభమ్ గుప్తా), ముగ్గురు జవాన్లు(హవిల్దార్‌ అబ్దుల్‌ మాజిద్‌, లాన్స్‌ నాయక్‌ సంజయ్‌ బిష్త్‌, పారా ట్రూపర్ సచిన్‌ లార్‌) ప్రాణాలు కోల్పోయారు. హడావుడి జీవితంలో ఈ సైనికుల త్యాగాలు విస్మరణకు గురవుతున్నాయని మహీంద్రా పోస్టుకు స్పందనగా  నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదిని లష్కరే తోయిబా అగ్ర కమాండర్‌ క్వారీగా గుర్తించారు.  ‘‘క్వారీ గత ఏడాదిగా రాజౌరీ- పూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడే’’ అని రక్షణశాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని