డీప్‌ఫేక్‌లపై కొరడా

సమాజానికి కొత్త సమస్యగా మారిన డీప్‌ఫేక్‌ పోస్టుల నియంత్రణకు త్వరలో కొత్త నిబంధనలు విడుదల చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 24 Nov 2023 06:37 IST

వాటి సృష్టికర్తలకు జైలుశిక్ష, జరిమానా
ప్రసారానికి వేదికలైన సంస్థలపైనా చర్యలు
త్వరలో కొత్త నిబంధనలు: అశ్వినీ వైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: సమాజానికి కొత్త సమస్యగా మారిన డీప్‌ఫేక్‌ పోస్టుల నియంత్రణకు త్వరలో కొత్త నిబంధనలు విడుదల చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. వాటిని సృష్టించిన వ్యక్తులు, ప్రసారం చేసిన వేదికలకు శిక్ష, జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై గురువారం సామాజిక మాధ్యమాల వేదికలతో సమావేశమైన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘డీప్‌ఫేక్‌ పోస్టులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయి. వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని ఇవి బలహీనపరుస్తాయి. ఇప్పుడున్న సామాజిక మాధ్యమ వేదికలు.. డీప్‌ఫేక్‌ పోస్టులను ఎలాంటి తనిఖీలు లేకుండా వేగంగా ప్రచారంలో పెట్టడానికి వీలు కల్పిస్తున్నాయి. అప్‌లోడ్‌ అయిన నిమిషాల్లోనే అవి వైరల్‌గా మారుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. డీప్‌ఫేక్‌ను నియంత్రించడానికి వచ్చే పది రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. డీప్‌ఫేక్‌లను కనిపెట్టడం, దాని వ్యాప్తి నియంత్రణ, వాటి గురించి వెంటనే ఫిర్యాదు చేయడం, ప్రజల్ని చైతన్యపరచడం గురించి తాజా సమావేశంలో చర్చించాం. కేంద్రం ప్రకటించే కార్యాచరణ ఈ నాలుగు అంశాల ఆధారంగానే ఉంటుంది. నియంత్రణలు ఉండాలన్న భావనను అన్ని సామాజిక వేదికలూ వ్యక్తంచేశాయి. నిబంధనల రూపకల్పనను వెంటనే ప్రారంభిస్తున్నాం’’ అని వైష్ణవ్‌ వెల్లడించారు.

ముద్ర వేయడానికి అంగీకారం

‘‘డీప్‌ఫేక్‌ సృష్టించిన వ్యక్తికి, దాన్ని ప్రసారం చేసిన వేదికకు బాధ్యత ఉంటుంది. వీడియోలు, చిత్రాలపై అవి డీప్‌ఫేక్‌ అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ లేబులింగ్‌ (ముద్ర), వాటర్‌ మార్కులు వేయడం గురించి అన్ని వేదికల ప్రతినిధులూ అంగీకరించారు. డీప్‌ఫేక్‌లు విదేశాల్లో తయారైనా భారత్‌లో ప్రదర్శిస్తే మాత్రం వాటికి స్థానిక నిబంధనలు, చట్టాలు వర్తిస్తాయి. సమాజానికి హానిచేసే కృత్రిమమేథకు సంబంధించిన అంశాలన్నింటిపైనా నియంత్రణలు ఉంటాయి. కొత్త నిబంధనలపై ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తాం. త్వరలో ఈ-మెయిల్‌ చిరునామా ప్రకటిస్తాం. ఆసక్తి ఉన్నవారెవరైనా అభిప్రాయాలు పంపొచ్చు. డీప్‌ఫేక్‌లను ఆటోమేటిగ్గా గుర్తించే సాధనాల అభివృద్ధికి సామాజిక మాధ్యమ సంస్థలన్నీ అంగీకరించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలను నియంత్రించడంపైనా.. 10 రోజుల్లోగా జరిగే తదుపరి సమావేశంలో చర్చిస్తాం. డీప్‌ఫేక్‌ అనేది ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసేలా వాటర్‌మార్క్‌ను ప్రదర్శించడంలాంటి విషయాలపై చర్చించబోతున్నాం. శిక్ష, జరిమానాలు వెనకటి తేదీల నుంచి వర్తించవు. కొత్త నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉంటాయి’’ అని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఆ డీప్‌ఫేక్‌ వీడియోలో ఉన్నది మోదీ కాదు.. నేనే: వికాస్‌ మహంతి

ప్రధాని మోదీ గార్బా ఆడినట్టుగా ఉన్న వీడియోలో కనిపిస్తున్నది మోదీ కాదని, తానేనని వికాస్‌ మహంతి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రాం ద్వారా తెలిపారు. ‘అది డీప్‌ఫేక్‌ వీడియో కాదు. నేను ఒక కళాకారుడిని. ప్రధాని మోదీ పోలికలతో ఉన్నందున నన్ను అనేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రధాని ప్రతిష్ఠను దిగజార్చే పనులు చేయను’ అని వివరణ ఇచ్చారు. వికాస్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని