Anand Mahindra: సమష్టి కృషితో ఏదైనా సాధ్యమే.. కార్మికుల రాకపై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

దాదాపు 17 రోజులుగా సొరంగంలో చిక్కుపోయిన కార్మికులను సహాయక బృందాలు ఎట్టకేలకు సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాయి. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. 

Updated : 29 Nov 2023 11:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi) సిల్‌క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు 17 రోజులపాటు అహర్నిశలు శ్రమించాయి. ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ తవ్వకాలు చేపట్టి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సొరంగంలో కార్మికుల ధైర్యసాహసాలు.. వారిని కాపాడిన సహాయక బృందాల శ్రమను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

 సొరంగంలోని కార్మికులు సురక్షితంగా బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. ‘‘17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల విలువైన ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు శ్రమించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. దేశంలో ఏ క్రీడా విజయం ఇవ్వనంత ఆనందాన్ని మీరు ఈ రోజు అందించారు. ఈ చర్యతో మీరు ఓ దేశం ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో.. ఒక్క ఆశపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఎటువంటి సంక్లిష్ట సొరంగమైనా మనల్ని బయటపడకుండా ఆపలేదని నిరూపించారు’’ అని మహీంద్రా పేర్కొన్నారు. వైరల్‌గా మారిన మహీంద్రా పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ‘‘చాలా బాగా చెప్పారు సర్‌. సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతీ ఒకరికీ సెల్యూట్‌’’  అంటూ కామెంట్లు పెట్టారు.

మృత్యుంజయులు

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సిల్‌క్యారా సొరంగం కుప్పకూలింది. దీంతో 41 మంది కూలీలు దానిలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో అధికారులు లోపల ఉన్న వారికి ఆక్సిజన్‌ అందేలా ఏర్పాట్లు చేశారు. నీరు, ఆహారాన్ని పైపుల ద్వారా సరఫరా చేశారు. సహాయా బృందాలు కార్మికులను బయటకు తీసుకువచ్చే క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. 17 రోజులు నిర్విరామంగా శ్రమించి ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ తవ్వకాలు చేపట్టి బాధితులను సురక్షితంగా వెలుపలకు తీసుకువచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని