Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై మరో పరువునష్టం కేసు (defamation case) నమోదైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను కౌరవులతో  పోల్చినందుకు గానూ కమల్‌ బదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. 

Updated : 01 Apr 2023 18:38 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కోర్టులో ఆర్ఎస్‌ఎస్‌ కార్యకర్త కమల్‌ బదౌరియా పరువునష్టం దావా వేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా జనవరి 9న హరియాణాలోని అంబాలా జిల్లాలో పర్యటించిన రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను కౌరవులతో పోల్చారని కమల్‌ బదౌరియా ఆరోపించారు. 

అంబాలాలో నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలంతా 21వ శతాబ్దపు కౌరవులని వ్యాఖ్యానించారు. ‘‘ కౌరవులు ఎవరు? మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతా వినండి. వాళ్లంతా ఖాకీ ప్యాంటులు వేసుకుంటారు. బూట్లు వేసుకొని, చేతిలో లాఠీ పట్టుకుంటారు. దేశంలోని ఇద్దరుముగ్గురు సంపన్నులు వారికి మద్దతుగా ఉంటారు.’’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసుపై ఏప్రిల్‌ 12న హరిద్వార్‌ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

మోదీ పేరుపై విమర్శలు చేసినందుకు గానూ సూరత్‌ కోర్టు గత నెలలో రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పై కోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తూ.. శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ‘ మోదీ ఇంటిపేరు ఉన్నవారందరూ దొంగలే’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ వ్యాఖ్యానించారని గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇటీవల రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని