Manipur violence: ప్రాధేయపడినా వదల్లేదు.. మణిపుర్‌లో మరో ఆటవిక చర్య!

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరో ఆటవిక చర్య వెలుగులోకి వచ్చింది. కొందరు మృగాళ్లు ఓ మహిళను వెంబడించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడారు. మే నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 10 Aug 2023 16:17 IST

ఇంఫాల్‌: జాతి వైరాలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో (Manipur) అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఆటవిక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో పార్లమెంట్‌ (Parliament) ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారక ముందే.. సరిగ్గా అలాంటి అమానవీయ చర్యే మరొకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దాదాపు 40కి.మీ దూరంలో ఉన్న చురాచాంద్‌పుర్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఐదారుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వద్దని ప్రాధేయపడినా కనికరించలేదు. మే 3న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలెవరైనా తాము ఎదుర్కొన్న దారుణాలను ఎలాంటి భయం లేకుండా అధికారులకు చెప్పొచ్చని, వారికి తగిన రక్షణ కల్పిస్తామని అక్కడి ప్రభుత్వం, అధికారులు భరోసా ఇస్తుండటంతో ఒక్కొక్క ఘటన వెలుగులోకి వస్తున్నాయి.

37 ఏళ్ల మహిళ తాను ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. చురాచాంద్‌పుర్‌లోని ఓ గ్రామంలో మే 3న సాయంత్రం 6.30 గంటల సమయంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు, మరదలు, మరో ఇద్దరు చిన్నారులతో కలిసి బయటకు పరుగులు తీసింది. ఇద్దరు చిన్నారుల్లో ఓ చిన్నారిని తన వెనకన కట్టుకుంది. మరో చిన్నారిని మరదలికి అప్పగించింది. వీరంతా వీధిలో పరుగెడుతుండగా వారిని కొందరు దుండగులు వెంబడించారు. ఈ క్రమంలో ఆ మహిళ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ముందు వెళ్తున్న మరదలు ఆమెను లేపే ప్రయత్నం చేసినా, లేవలేకపోయింది. దీంతో ఆ ఇద్దరు పిల్లలతోపాటు, చిన్నారిని తీసుకొని మరదలు అక్కడి నుంచి తప్పించుకుంది. మహిళను సమీపించిన దుండగులు ఆమెను దుర్భాషలాడుతూ, వికృత చేష్టలకు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమెపై భౌతిక దాడికి దిగారు. వదిలిపెట్టాలంటూ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడిన వదల్లేదు. అందులో ఒకడు ఆమెను వివస్త్రను చేయగా.. అంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

డీఐజీ సారూ.. ఇదేం పని?

అయితే, కుటుంబం పరువు పోతుందేమోనని ఇన్ని రోజులు ఆ బాధను పంటి బిగువున భరించానని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం పదిమందికీ తెలిసే తమను జాతి నుంచి వెలివేస్తారేమోనన్న భయంతో బయటకు చెప్పలేదని, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యం పాడవ్వడంతో ఇంఫాల్‌లోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వెళ్లానని, అయితే, ఏం జరిగిందని వైద్యుడు అడిగితే ఏం చెప్పాలో తెలియక డాక్టర్‌ను కలవకుండానే తిరిగి వచ్చేశానని పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. అయితే, ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం ‘జేఎన్‌ఐఎంఎస్‌’ ఆస్పత్రికి వెళ్లానని, అక్కడి వైద్యులు పరీక్షించి కౌన్సిలింగ్‌ ఇచ్చారని చెప్పారు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మరోవైపు మే 3 నుంచి జులై 30 వరకు 6,500 కేసులు నమోదైనట్లు మణిపుర్‌ ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టుకు వివరించింది. వీటిలో ఎక్కువగా జీరోఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. కుకీ తెగకు చెందిన వారు తక్కువగా ఉన్న ప్రాంతంలో మైతేయ్‌లు వారిపై దాడికి దిగుతున్నారు. అలాగే.. మైతేయ్‌ వర్గానికి చెందినవారు తక్కువగా ఉన్న ప్రాంతంలో కుకీలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలు తమకు మద్దతు లభించే ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసులు సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని