Rajouri: కొనసాగుతున్న ఉగ్రవేట.. నేడు రాజౌరీకి ఆర్మీ చీఫ్‌

రాజౌరీ-పూంఛ్‌లో ఉగ్రకార్యకలాపాలపై సైన్యం దృష్టి సారించింది. ఇటీవల ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం వేటను తీవ్రం చేసింది. నేడు ఆర్మీ చీఫ్‌ స్వయంగా ఇక్కడ సమీక్ష నిర్వహించనున్నారు.

Published : 25 Dec 2023 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిసెంబర్‌ 21న రాజౌరీలో ఉగ్రదాడికి కారణమైన ముష్కరుల కోసం తీవ్ర స్థాయిలో వేట కొనసాగుతోంది. జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ-పూంఛ్‌ జిల్లాల్లో మూడో రోజు కూడా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఇక్కడ కూంబింగ్‌ ఆపరేషన్లను సైన్యం ముమ్మరం చేసింది. ముఖ్యంగా డేరా కి గలీ, బాఫియాజ్‌ ప్రాంతాలపై భద్రతా దళాలు దృష్టిపెట్టాయి.

జేఎన్‌.1తో భయం లేదు

ఇటీవల పూంఛ్‌లో సైనికులను తరలిస్తున్న వాహనాలపై ఉగ్రమూక దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులయ్యారు.  ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతంలో ముగ్గురు పౌరులు సైనిక కస్టడీలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సైన్యం అంతర్గత దర్యాప్తు చేపట్టింది. కొందరు అధికారులపై చర్యలకు కూడా సిద్ధమైంది. సైన్యం చేపట్టిన దర్యాప్తు 72 గంటల్లో పూర్తికావాల్సి ఉంది. ఇక ఉగ్రదాడిలో మరణించిన సైనికులు వీరేంద్ర సింగ్‌, గౌతమ్‌ కుమార్‌ భౌతికకాయాలకు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ నివాళులర్పించారు. 

రాజౌరీ సెక్టార్‌కు మనోజ్‌ పాండే.. 

ఇటీవల సైనిక వాహనాలపై ఉగ్రదాడి జరిగిన రాజౌరీ సెక్టార్‌లో నేడు ఆర్మీచీఫ్‌ మనోజ్‌ పాండే పర్యటించనున్నారు. ఈ ప్రాంతంలో సైన్యం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల తీరును ఆయన సమీక్షించనున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికులకు ఆయన నివాళి అర్పించనున్నారు. ఇక జమ్మూలోని నగ్రోటలో ఆర్మీ వైట్‌నైట్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరపనున్నారు. ఏడాది వ్యవధిలోనే ఇక్కడ జరిగిన దాడుల్లో దాదాపు డజను మందికిపైగా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో కెప్టెన్‌, మేజర్‌ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని