Manipur violence: మానవత్వంతో వ్యవహరించడం బలహీనత కాదు: మణిపుర్‌ ఆందోళనలపై ఆర్మీ హెచ్చరిక

Manipur violence: సుమారు రెండు నెలలుగా మణిపుర్‌లో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. మరోపక్క రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా బలగాలు చేస్తోన్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. దీనిపై ఆర్మీ రాష్ట్ర ప్రజలకు ఓ విన్నపం చేసింది.

Updated : 27 Jun 2023 10:40 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరం వల్ల ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. నిరసనకారులు ఒక్కసారిగా గుంపులుగా వచ్చి తమవారిని విడిపించుకొని పోవడం, నేతలు, అధికారుల ఇళ్లను దహనం చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలపై భారత సైన్యంలోని ‘స్పియర్‌ కోర్‌’ (Indian Army) ఓ వీడియోను విడుదల చేసింది. మానవత్వంతో ఉండటం తమ బలహీనత కాదంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. (Manipur violence)

‘మణిపుర్‌(Manipur)లోని మహిళా కార్యకర్తలు.. ఉద్దేశపూర్వంగా రహదారులను దిగ్బంధిస్తున్నారు. అలాగే భద్రతాబలగాల కార్యకాలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు భద్రతాబలగాల ప్రయత్నాలకు ఈ ప్రవర్తన ప్రమాదకరంగా మారింది. శాంతి పునరుద్ధరణకు చేస్తోన్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాం’అని  స్పియర్‌ కోర్‌ ట్వీట్‌లో పేర్కొంది. 

రెండురోజుల క్రితం సైన్యం అదుపులోకి తీసుకొన్న 12 మంది మిలిటెంట్లను విడిపించుకునేందుకు ఏకంగా 1,500 మంది మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సైన్యం వారిని కోరినా.. ఫలితం లేకపోయింది. ఇలా ఇరువర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం మిలిటెంట్లను విడిచిపెట్టింది. పౌరుల భద్రత దృష్ట్యా ప్రాణనష్టాన్ని నివారించేందుకు మానవతా దృక్పథంతో మిలిటెంట్లను వదిలిపెట్టినట్లు సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.  తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur) గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఇది ఘర్షణకు దారితీయడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇటీవల దీనిపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.  మణిపుర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అమిత్‌ షా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్ తెలిపారు.

మరోవైపు సీఎంగా బీరెన్‌ సింగ్‌(N. Biren Singh)ను తప్పించి, మణిపుర్‌(Manipur)లో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌లు పెరుగుతున్నాయి. అలానే మణిపుర్ పరిస్థితులపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, హింసాత్మక ఘటనలను కేంద్ర హోం మంత్రి నియంత్రించలేకపోయారని కాంగ్రెస్ విమర్శించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని