Arun Govil: ‘రాజ్యాంగం మార్పు’పై వ్యాఖ్యలు.. వివాదంలో టీవీ రాముడు

Arun Govil: ‘రామాయణ్‌’ సీరియల్‌ నటుడు, మేరఠ్‌ భాజపా అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ రాజ్యాంగం మార్పును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

Published : 15 Apr 2024 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మరోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని (Constitution) మార్చేస్తారంటూ గత కొంతకాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిని భాజపా నేతలు ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్నారు. అయితే, తాజాగా ఈ అంశంపై టీవీ రాముడిగా పేరొందిన మేఠర్‌ భాజపా (BJP) అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ (Arun Govil) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగంలో మార్పులు జరగొచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

‘రాజ్యాంగం మార్పు’పై విపక్షాలు చేస్తున్న ఆరోపణల గురించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరుణ్‌ గోవిల్‌ను ఇటీవల మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘కాలానుగుణంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు జరిగాయి. మార్పు అనేది అభివృద్ధికి సంకేతం. ఇది ప్రతికూలాంశం కాదు. నాటికి, నేటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయితే, రాజ్యాంగంలో మార్పులు జరగాలంటే మాత్రం అది ఓ వ్యక్తి అభిప్రాయంతో సాధ్యం కాదు. ప్రతిఒక్కరి ఏకాభిప్రాయంతో దాన్ని మార్చుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది.

ఎన్నికల్లో ధన వర్షం.. రోజుకు రూ.100కోట్లు సీజ్‌!

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్‌ ఈ వీడియోను షేర్‌ చేస్తూ భాజపాపై విమర్శలు గుప్పించారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తే భాజపా రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందనేది ఇప్పుడు స్పష్టమైంది. రిజర్వేషన్లు ఇక ఉండవు. దళితులు, వెనకబడిన వర్గాల వారు దీన్ని గుర్తించాలి. జ్యోతి మిర్దా, అనంత్ హెగ్డే లాంటి నేతల తర్వాత ఇప్పుడు అరుణ్‌ గోవిల్‌ కూడా ఇదే చెప్పారు. ఈయన మోదీజీ నేరుగా ప్రతిపాదించిన అభ్యర్థి’’ అని ఆప్‌ ఎంపీ కేంద్రాన్ని దుయ్యబట్టారు. పలువురు విపక్ష నేతలు కూడా దీనిపై విమర్శలు వ్యక్తంచేస్తున్నారు.

రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే పార్లమెంటులో భాజపాకు భారీ మెజార్టీ రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో విపక్ష నేతలు ప్రధానంగా దీన్నే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. అంబేడ్కర్‌ స్వయంగా వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని