Kejriwal: సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు.. దిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి పెద్ద సంఖ్యలో వెళ్లిన ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.

Updated : 22 Mar 2024 00:12 IST

దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల్లో వ్యవధిలోనే కేజ్రీవాల్‌ నివాసానికి సెర్చ్‌ వారెంట్‌తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం.. ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఆప్‌ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రేనని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు.  

మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్‌ను తరలించారు. పోలీసులు ఈడీ కేంద్ర కార్యాలయ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ స్పెషల్‌ సీపీ మధు తివారీ నేతృత్వంలో భద్రత ఏర్పాట్లు చేశారు. ఈడీ కార్యాలయానికి వచ్చే మార్గాలను పోలీసులు మూసివేశారు. 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ఇదిలా ఉండగా.. ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్‌ టీమ్‌ అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా ఈ రోజు విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం విచారణకు తీసుకోనున్నట్లు తెలిపింది. 

కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే.. అసెంబ్లీ స్పీకర్‌

కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల రాకపై దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణిచివేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు