Arvind Kejriwal: రాత్రంతా ఈడీ లాకప్‌లో కేజ్రీవాల్‌.. దిల్లీలో భద్రత కట్టుదిట్టం

Arvind Kejriwal: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ఈ ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించారు. నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. 

Updated : 22 Mar 2024 10:39 IST

దిల్లీ: దేశ రాజధానిలో మద్యం పాలసీ (Excise policy case)కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. నిన్న రాత్రి సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆయనను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ కేజ్రీవాల్‌ను లాకప్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. రాత్రంతా ఆయన సరిగా నిద్రపోలేదని, తెల్లవారుజామునే నిద్రలేచి అల్పాహారం, మందులు తీసుకున్నారని పేర్కొన్నారు.

10 రోజుల కస్టడీ కోరే అవకాశం..

ఈ ఉదయం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేడు ఆయనను ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. సీఎంను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరే అవకాశముంది. ఇదే కేసులో గతవారం అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించేలా దర్యాప్తు సంస్థ కోర్టు అనుమతి కోరనుంది.

కుదిపేస్తున్న దిల్లీ మద్యం కుంభకోణం

దిల్లీలో భద్రత కట్టుదిట్టం..

కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. దీంతో దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈడీ ప్రధాన కార్యాలయంతో పాటు సీఎం నివాసం, భాజపా ఆఫీసుల ఎదుట భారీగా బలగాలను మోహరించారు. దిల్లీలోని ఐటీఓ మెట్రో స్టేషన్‌ను ఈ సాయంత్రం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

నేడు సుప్రీం విచారణ..

ఇదిలా ఉండగా.. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై నేడు అత్యవసర విచారణ చేపట్టే అవకాశముంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని