Kejriwal: కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.

Updated : 23 Apr 2024 15:47 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2021-22 నాటి దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ గత నెలలో ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్‌ను వేర్వేరు తేదీల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత వీరిద్దరూ తిహాడ్‌ జైలులోనే ఉంటున్నారు. మరోవైపు, ఇటీవల సీబీఐ కవితను తన కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. 

సూర్యాస్తమయం లోపే కవితను అరెస్టు చేశాం.. ఈడీ వాదనలు

ఇదిలాఉండగా.. కవిత బెయిల్‌ పిటిషన్‌పైనా దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తరఫున జోయబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని వాదించారు. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్‌ 19కి అనుగుణంగా జరిగినట్లు ఈడీ తరఫు న్యాయవాది వివరించారు. ‘‘ కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు. 2023 సెప్టెంబర్‌ 26న ఈడీ తదుపరి 10 రోజులు సమన్లు ఇవ్వబోమని అండర్‌ టేకింగ్‌ ఇచ్చింది. మార్చి 15న సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశాం. తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను మార్చి 19న ఆమె ఉపసంహరించుకున్నారు. కవితకు వ్యతిరేకంగా  శరత్‌చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారు. కవితను సూర్యాస్తమయం లోపే అదుపులోకి తీసుకున్నాం. కవిత అరెస్టు సాయంత్రం 5.20గంటలకు జరిగింది.

కవిత అరెస్టు రోజు హైదరాబాద్‌లో సూర్యాస్తమయం సాయంత్రం 6.26గంటలకు అయ్యింది. ఇండోస్పిరిట్స్‌ కంపెనీలో కవిత బినామీగా అరుణ్‌ పిళ్లై ఉన్నారు. అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నాం. అరెస్టు చేసిన 24గంటల్లో కోర్టులో హాజరుపరిచాం. సౌత్‌గ్రూప్‌లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్‌ మండూరి బినామీగా ఉన్నారు’’ అని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈడీ వాదనలు పూర్తయిన తర్వాత కవిత తరఫు న్యాయవాదులు కౌంటర్‌ వాదనలు వినిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని