Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. వ్యక్తిగత కార్యదర్శిపై వేటు

Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు పడింది. 2007 నాటి క్రిమినల్‌ కేసు వ్యవహారం నేపథ్యంలో విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ చర్యలు చేపట్టింది.

Updated : 11 Apr 2024 13:51 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన కేసు (Delhi Excise Scam Case)లో అరెస్టయి జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని వైభవ్‌ కుమార్‌పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన్ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిష్‌ కామెంట్లకు ఆరెంజ్‌తో చెక్‌..: విమర్శలకు దీటుగా తేజస్వీయాదవ్‌ కౌంటర్

‘‘ఈ నియామకంలో అవకతవకలు జరిగాయి. పాలనావ్యవహారాల పరంగా ఇది ఇబ్బందికర పరిణామం. ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్‌ లేకుండా, పూర్వాపరాలను సరిచూడకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదు. వైభవ్‌పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవి. వాటిపై విచారణ జరుగుతోంది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకోకుండానే పీఎస్‌గా నియమించారు’’ అని విజిలెన్స్‌ విభాగం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. మద్యం కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 8న వైభవ్‌ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనపై వేటు వేయడం గమనార్హం.

ఈ పరిణామాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పార్టీని సమూలంగా నాశనం చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని భాజపాను దుయ్యబట్టింది. ‘‘మొదట తప్పుడు కేసులో సీఎంను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహా కేజ్రీవాల్‌ సిబ్బంది మొత్తాన్ని తొలగించే పని మొదలుపెట్టారు. ఆప్‌ను నాశనం చేయడమే భాజపా ఏకైక లక్ష్యమని మరోసారి స్పష్టమైంది’’ అని మండిపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని