Arvind Kejriwal: విచారణలో ఆతిశీ, భరద్వాజ్‌ పేర్లు ప్రస్తావించిన కేజ్రీవాల్‌ : ఈడీ

ఈడీ విచారణ సమయంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇద్దరు మంత్రుల పేర్లను వెల్లడించారు. వారే నిందితుడు విజయ్‌ నాయర్‌తో మాట్లాడినట్లు చెప్పారని దర్యాప్తు సంస్థ కోర్టులో పేర్కొంది.

Updated : 01 Apr 2024 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడైన విజయ్‌ నాయర్‌ (Vijay Nair) తన మంత్రి వర్గంలోని ఇద్దరికి రిపోర్టు చేసేవాడని పేర్కొన్నట్లు ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు రౌజ్‌అవెన్యూ కోర్టుకు సోమవారం తెలిపారు. ఈవెంట్స్‌ కంపెనీ ఓన్లీ మచ్‌ లౌడర్‌ సీఈవో విజయ్‌ నాయర్‌ను ఈ కేసులో 2022లోనే అరెస్టు చేశారు. ఆయన ఎప్పటినుంచో ఆప్‌తో కలిసి పనిచేస్తున్నారు. 

‘‘నాయర్‌ తనకు రిపోర్టు చేయడని విచారణ సమయంలో కేజ్రీవాల్‌ తెలిపారు. మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌కు మాత్రమే అతడు నివేదించేవాడు’’ అని రాజు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తొలిసారి ఈ కేసులో కోర్టు ఎదుట ఈ ఇద్దరి మంత్రుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఆ సమయంలో వారు కోర్టు రూమ్‌లోనే ఉన్నారు. దీనిపై ఓ మీడియా సంస్థ ఆతిశీని ప్రశ్నించగా.. ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

గతంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ ఎన్‌డీ గుప్తా ఈడీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఒకసారి ఆతిశీ పేరును ప్రస్తావించారు. గోవా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఆమె పని చేశారని వెల్లడించారు.

నేను గోవా ఎన్నికల ప్రచారంలో లేను: కైలాశ్‌ గహ్లోత్‌

ఆప్‌ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ ఈడీ విచారణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ప్రభుత్వం సివిల్‌ లేన్స్‌లో నాకు బంగ్లాను కేటాయించింది. కానీ, నేను వసంత్‌కుంజ్‌లోని ఇంట్లోనే ఉంటున్నాను. నా పిల్లలు అక్కడికి రావడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ బంగ్లాలో విజయ్‌నాయర్‌ ఉంటున్నాడు. ఈడీ ఎలాంటి క్రాస్‌ క్వశ్చన్స్‌ అడగలేదు. నాకు జారీ అయిన రెండు సమన్లకే స్పందించి విచారణకు హాజరయ్యాను. మరికొంత సమయం కోరాను. ఇక గోవా ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనలేదు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు’’ అని పేర్కొన్నారు. 

కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. తిహాడ్‌ జైలుకు సీఎం

దిల్లీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌కు ఈడీ శనివారం నోటీసులిచ్చింది. విచారణ నిమిత్తం అదేరోజు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేసుకు సంబంధించి మంత్రిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు. గహ్లోత్‌ ప్రస్తుతం కేజ్రీవాల్‌ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం విధానంపై ముసాయిదాను తయారుచేసే సమయంలో అప్పటి ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్ ఛార్జి విజయ్‌నాయర్‌.. గహ్లోత్‌ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని