Arvind Kejriwal: సుప్రీంలో పిటిషన్‌ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్‌

Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు, తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీఎం ఉపసంహరించుకున్నారు.

Updated : 22 Mar 2024 14:51 IST

(అరెస్టు నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఇంటి వద్ద మోహరించిన బలగాలు)

దిల్లీ: మద్యం విధానానికి (Excise policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీఎం ఉపసంహరించుకున్నారు. అనంతరం ఈడీ ఆయనను కోర్టులో హాజరుపర్చింది.

తొలుత కేజ్రీవాల్‌ అభ్యర్థనపై నేడు అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ వెల్లడించారు. అయితే, ఈ విచారణ.. ట్రయల్‌ కోర్టులో రిమాండ్‌ ప్రొసీడింగ్స్‌తో క్లాష్‌ అవుతుందని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్‌ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్‌ను ప్రత్యేక కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చారు.

గృహనిర్బంధంలో కుటుంబం..

మరోవైపు, సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌ నివాసానికి మంత్రి వెళ్లగా ఆయనను లోనికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం అరెస్టయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులున్నారు. వారందరినీ కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు. ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు సరే.. ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష?’’ అని గోపాల్‌ రాయ్‌ మండిపడ్డారు.

వాట్‌నెక్స్ట్‌.. ఎన్నికల్లో ఆప్‌ను నడిపేదెవరు..?

పోలీసుల అదుపులో మంత్రులు..

కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతలు రోడ్డెక్కారు. భాజపా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనలు చేపట్టిన ఆప్‌ మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని