Kapil Sibal: అస్సాం అప్పుడు మయన్మార్‌లో భాగమే: కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన హిమంత

Kapil Sibal: ‘అస్సాం (Assam)’పై సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్‌ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా ఖండించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇంతకీ కపిల్‌ సిబల్‌ ఏమన్నారంటే..?

Updated : 09 Dec 2023 15:50 IST

దిల్లీ: ‘అస్సాం (Assam)’పై సీనియర్‌ న్యాయవాది, ఎంపీ కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా.. ‘అస్సాం ఒకప్పుడు మయన్మార్‌ (Myanmar)లో భాగమే’ అంటూ సిబల్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఇది కాస్తా రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తీవ్రంగా మండిపడ్డారు.

1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఏ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కపిల్‌ సిబల్ తన వాదనలు వినిపిస్తూ.. ‘‘వలసలపై ఎలాంటి రికార్డులు ఉండవు. ఒకవేళ మీరు అస్సాం చరిత్రను చూసినట్లయితే.. ఎవరు ఎప్పుడు వచ్చారనేది గుర్తించడం అసాధ్యమని మనకు అర్థమవుతుంది. వాస్తవానికి అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో భాగం. 1824లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అస్సాంను మయన్మార్‌ బ్రిటిష్‌ వారికి అప్పగించింది’’ అని వ్యాఖ్యానించారు.

ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై స్పందన

కపిల్‌ వాదనలకు సంబంధించి జాతీయ మీడియాల్లో కొన్ని కథనాలు రావడంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా స్పందిస్తూ.. సిబల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘అస్సాం చరిత్ర గురించి తెలియని వారు.. మా రాష్ట్రం గురించి మాట్లాడొద్దు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. కొంతకాలం పాటు దీని గురించి గొడవలు జరిగాయి. అంతే తప్ప.. అస్సాం మయన్మార్‌లో భాగమేనంటూ చెప్పే ఏ డేటాను ఇంతవరకూ నేను చూడలేదు’’ అంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని